-

32 లక్షల డెబిట్ కార్డులు బ్లాక్!

21 Oct, 2016 12:49 IST|Sakshi
32 లక్షల డెబిట్ కార్డులు బ్లాక్!

అంతర్జాతీయ నేరగాళ్ల చేతిలో కార్డుల సమాచారం
 సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాంకు ఖాతాలోని డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి, షాపుల్లో లావాదేవీలు నిర్వహించటానికి ఉపయోగించే డెబిట్ కార్డుల సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. ముందే అప్రమత్తమైన బ్యాంకులు... ఏకంగా 32 లక్షల డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేసేశాయి. కాకపోతే పెను ప్రమాదాన్ని తప్పించుకున్నా... కొన్ని కార్డులు మాత్రం ఇప్పటికే నేరగాళ్ల లావాదేవీలకు బలయ్యాయి. చైనా, అమెరికాల్లో లావాదేవీలు జరిపిన ఈ నేరగాళ్లు... కోటిన్నర రూపాయల్ని కాజేశారు. ఈ విషయం వాటి యజ మానులు బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే బయట పడింది. మరి ఇప్పటికీ తమ లావాదేవీల నివేదికలను చూసుకోనివారి సంగతో..? ఏమో!! దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర 19 బ్యాంకులకు చెందిన కార్డుల సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కటంతో... ఖాతాదారుల్లో ఆందోళన రేగుతోంది.
 
 ఏమిటిది? ఎలా జరిగింది?
 ఒక బ్యాంకులోని ఖాతాదారుడు ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. కారణం... ఆ కార్డు పేమెంట్ ప్రాసెసింగ్ గేట్‌వేలు అనుసంధానమై ఉండటమే. ఇండియాలో వీసా, మాస్టర్ కార్డ్, రూపే ఈ మూడే ప్రధాన పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థలు. ఇపుడు వీటి నుంచే డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారం తస్కరణకు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, అమెరికాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) బ్యాంకుల్ని హెచ్చరించటంతో మొత్తం వ్యవహారం బయటపడినట్లు భావిస్తున్నారు.
 
 జరిగిందిలా...!!
 ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ బ్యాంకు తాలూకు ఏటీఎంలను ‘హిటాచి పేమెంట్ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. ఏటీఎం ద్వారా పేమెంట్ సేవలు అందించటం, ఏటీఎం యంత్రాల్లో నగదు నింపడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) తదితర సేవలను చూస్తోంది. బ్యాంకు ఆటో పాస్‌బుక్ ఎంట్రీ మెషిన్ల నిర్వహణ కూడా ఈ సంస్థే నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఓ మాల్‌వేర్ (దొంగ సాఫ్ట్‌వేర్) ఈ సంస్థకు చెందిన కంప్యూటర్ల వ్యవస్థలోకి చొరబడింది. దీన్ని ఆలస్యంగా సెప్టెంబర్లో గుర్తించారు.
 
  ఒక బ్యాంకు ఏటీఎం నెట్‌వర్క్ అన్ని బ్యాంకుల నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది కను క తద్వారా అన్ని బ్యాంకులకు చెందిన కార్డు హోల్డర్ల సమాచారం ఈ మాల్‌వేర్ ద్వారా నేరగాళ్ల చేతికి చిక్కింది. తమ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు సంబంధించి చైనా, అమెరికాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్టు పలు బ్యాంకుల కస్టమర్లు బ్యాంకు ల దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన నేషనల్ పేమెం ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా.. ఇప్పటిదాకా 641 మంది ఖాతాదారుల నుంచి ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని, లావాదేవీల విలువ రూ.1.3 కోట్లని బుధవారం వెల్లడించింది.
 
  ఈ మేరకు బ్యాంకుల్ని ఎన్‌పీసీఐ హెచ్చరించటంతో బ్యాంకులు పలు చర్యలు చేపట్టాయి. 32 లక్షలకుపైగా కార్డుల సమాచారం చోరికి గురై ఉంటుందని అంచనాకు వచ్చి... వాటిని బ్లాక్ లేదా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రాంతంలో యస్ బ్యాంకు ఏటీఎం నెట్‌వర్క్ సేవలను వినియోగించుకున్న వారి కార్డులకే ఈ ముప్పు ఉన్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కాగా, తమ నెట్‌వర్క్ భద్రతలో లోటుపాట్లూ జరగలేదని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ స్పష్టం చేసింది. తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు ఆడిట్ ఏజెన్సీని నియమించినట్లు తెలిపింది.
 
 తక్షణం చేయాల్సిందేంటి?
 
కార్డు బ్లాకయిందని సందేశం వచ్చినా, లావాదేవీలు సాధ్యం కాకున్నా తక్షణం బ్యాంకును సంప్రదించాలి.
 
చాలా బ్యాంకులు ఫిర్యాదుదారులకు వెంటనే చిప్ ఆధారిత హైసెక్యూరిటీ కార్డుల్ని ఉచితంగా జారీ చేస్తున్నాయి.
 
మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులున్నవారు బ్లాక్ కాకున్నా చిప్ ఆధారిత కార్డులు తీసుకోవటం మంచిది. పిన్ నంబర్లూ మార్చుకోవాలి.
 
బ్యాంకు ఖాతాలను అప్‌డేట్ చేస్తున్నామంటూ ఫోన్లు చేసినా... మీ ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబరు పంపాలని ఎస్సెమ్మెస్‌లు వచ్చినా సమాచారం పంపరాదు.  పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
 
ఏటీఎంలో డబ్బు తీసుకునేప్పుడు డెబిట్ కార్డు పిన్ నంబరును అపరిచిత వ్యక్తులకు ఎవరికీ తెలియనీయొద్దు. అపరిచితుల సహకారం తీసుకోవద్దు.
 
షాపుల్లో వస్తువులు కొని కార్డు ద్వారా చెల్లింపులు చేసేప్పుడు పిన్ నంబరు చెప్పొద్దు. మిషన్‌పై ఎవరికీ కనిపించకుండా మీరే ఎంటర్ చేయండి.
 
 6 లక్షల కార్డులు బ్లాక్ చేశాం...: ఎస్‌బీఐ
 ముందు జాగ్రత్తగా సదరు నెట్‌వర్క్ వినియోగించుకున్న కస్టమర్ల కార్డులను బ్లాక్ చేశాం. వాస్తవానికి ఈ డేటా ఉల్లంఘనలు ఈ ఏడాది మే, జూలై నెలల్లో చోటు చేసుకున్నాయి. కానీ సెప్టెం బర్లో గుర్తించాం. దీంతో ముందే కార్డులను మార్చేస్తున్నాం. డేటా చోరీకి గురైందని తెలిసిన వెంటనే ఏటీఎం పిన్ నంబర్లను మార్చుకోవాలని కస్టమర్లకు సూచించాం. కేవలం 7 శాతం మందే మార్చుకున్నారు. దీంతో రిస్క్ తలెత్తకుండా కార్డులను రీకాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా బ్యాంకు సిస్టమ్స్ అన్నీ పూర్తి సురక్షితంగానే ఉన్నాయి. ఇది మా బ్యాంకు వ్యవస్థ వెలుపల జరిగిన వ్యవహారం. ప్రస్తుత కార్డు దారులకు ముప్పేమీ లేదు. బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్తవి ఉచితంగానే ఇస్తాం.    - మంజు అగర్వాల్, ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ
 
 మరింత నిఘా అవసరం: యస్ బ్యాంకు
 అవుట్‌సోర్సింగ్ భాగస్వాములు తమ సేవలను కచ్చితంగా నిర్విహించేందుకు మరింత నిఘా అవసరం. వ్యవస్థకు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. వీరికి పోలీసులు కూడా తగిన స్థాయిలో సేవలందించాలి.    - రాణా కపూర్
 యాక్సిస్ బ్యాంక్: డేటా తస్కరణ ప్రభావానికి గురైన కస్టమర్లను వెంటనే పిన్ మార్చుకోవాలని కోరాం. మా బ్యాంకు ఏటీఎం నెట్‌వర్క్ పూర్తి భద్రతతో ఉంది.

 బ్యాంక్ ఆఫ్ బరోడా: మా బ్యాంకు వ్యవస్థలోని సాఫ్ట్‌వేర్‌ను తనిఖీ చేశాం. ఇప్పటికే కార్డులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాం.
 సెంట్రల్ బ్యాంక్: చైనాలో తమ కార్డులపై అనధికారిక లావాదేవీలు జరిగినట్లు కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. వారికి కనీసం పాస్‌పోర్టులు కూడా లేవు. వారి కార్డులను మార్చాం.
 
 ఆందోళన వద్దు: కేంద్ర ఆర్థిక శాఖ
 కార్డుల  బ్లాక్ నేపథ్యంలో... 99.5 శాతం కార్డులు సురక్షితంగానే ఉన్నాయని, 0.5 శాతం మేర కార్డుల సమాచారానికే ముప్పు ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రటరీ జీసీ ముర్ము మీడియాకు తెలిపారు. దేశంలో మొత్తం 60 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయని, వీటిలో 19 కోట్ల కార్డులను రూపే కార్డ్స్ దేశీయంగానే రూపొందించినట్టు చెప్పారు. మిగిలినవి వీసా, మాస్టర్‌కార్డు జారీ చేసినవన్నారు. కేవలం ఓ కంపెనీ మెషిన్లలో పరిమిత కాలంలోనే చోటుచేసుకున్న చిన్న అంశంగా తేల్చేశారు.  
 

మరిన్ని వార్తలు