32 మంది టెన్త్‌ విద్యార్థులపై కరోనా పాజిటివ్‌

4 Jul, 2020 14:40 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : సిలికాన్‌ సిటీ బెంగళూరును కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రాజధాని నలువైపులా కరోనా కేసులు నమోదవుతూ చక్రబంధంలోకి నెడుతోంది. తాజాగా పదో తరగతి విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నగరంలో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది విద్యార్థుల పరీక్షలు హాజరైయ్యేందుకు బయపడుతున్నారు. వారికి విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో పర్యటిస్తూ ధైర్యం చెబుతున్నారు. (గ్రేటర్‌లో 3 వేల కరోనా కేసులు మిస్సింగ్‌!)

బెంగళూరును కమ్మేసిన కరోనా 
మరోవైపురాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సుమారు 70–80 శాతం మేర పాజిటివ్‌ కేసులు ఒక్క బెంగళూరులో నమోదవుతుండడంతో నగరవాసుల్లో భయాందోళనలు ప్రారంభం అయ్యాయి. గత జూన్‌ నెలలో బెంగళూరులో మొత్తం 4,198 కరోనా బారిన పడగా, అందులో 85 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 312 మంది మాత్రమే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. బెంగళూరు నగరంలో మార్చి 9న తొలి కరోనా కేసు నమోదు అయింది. అక్కడి నుంచి జూలై 1 వరకు మొత్తం 5,290 కరోనా కేసులకు చేరుకోవడం విశేషం. జూలై 1 నాటికి మొత్తం 543 మంది కోలుకోగా, 97 మంది మరణించారు.  వాస్తవానికి మే 31 నాటికి కేవలం 357 మందిలో మాత్రమే కరోనా వైరస్‌ కనిపించింది.  ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా కరోనా విజృంభణ ప్రారంభమయింది. జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు బెంగళూరు పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ 16వ తేదీ నుంచి నగరంలో కేసుల సంఖ్య వేగంగా విస్తరించడం ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు