‘కరోనా’ వాహకులు వీరే

11 May, 2020 03:43 IST|Sakshi
నేవీకి చెందిన జలాశ్వ నౌకలో మాల్దీవుల నుంచి ఆదివారం కోచికి చేరుకున్న భారతీయులు

అహ్మదాబాద్‌లో 334 మంది గుర్తింపు

సూపర్‌ స్ప్రెడర్స్‌ కోసం ప్రత్యేకంగా పరీక్షలు

15వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ నగరంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించడానికి కారణమైన 334 మందిని ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది. గుజరాత్‌లో నమోదైన కరోనా కేసులు, మరణాల్లో అత్యధిక భాగం అహ్మదాబాద్‌లోనివే కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కూరగాయల విక్రేతలు, కిరాణా, పాల దుకాణాల యజమానులు, పెట్రోల్‌ పంపు సిబ్బంది, చెత్త సేకరించే వారి(సూపర్‌స్ప్రెడర్స్‌) ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు వేగంగా సోకుతోందని జిల్లా అధికారి పేర్కొన్నారు.

‘శనివారం చేపట్టిన పరీక్షల్లో వేజల్‌పూర్‌కు చెందిన కిరాణా దుకాణ యజమానికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గత 15 రోజుల్లో ఆ దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పాం. అహ్మదాబాద్‌ శివారు ధోల్కా పట్టణంలో ఓ పుచ్చకాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో, అతని కుటుంబసభ్యులు, తోటి వ్యాపారులు, తరచూ అతని వద్దకు వచ్చే కొనుగోలుదారులు..ఇలా 96 మందిని గుర్తించి క్వారంటైన్‌ చేశాం.

వీరిలో 12 మందికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలింది’అని ఆ అధికారి చెప్పారు. నగరంలో 14 వేలకు పైగా కరోనా వాహకులు ఉండి ఉంటారని, వీరందరికీ రాబోయే మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసమే పాలు, మందుల దుకాణాలు మినహా మిగతా వాటిని మే 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇప్పటివరకు 3,817 మంది నుంచి నమూనాలు సేకరించగా 334 మందికి పాజిటివ్‌ అని తేలిందన్నారు. పరీక్షలు పూర్తయ్యేదాకా పూర్తిగా నగర లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు.    

దేశీయంగా మొదటి కిట్‌ తయారీ..
పుణేకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ దేశీయంగా మొదటి కోవిడ్‌–19 యాంటీబాడీ టెస్ట్‌కిట్‌ను రూపొందించిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో రూపొందించిన దీనికి ‘కోవిడ్‌ కవచ్‌ ఎలిసా’ అని పేరు పెట్టారు. ఇది కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశం కోవి డ్‌–19పై పోరులో విజయం సాధించబోతోందని మంత్రి పేర్కొన్నారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. మరో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసూ లేదన్నారు.

కొత్త కేసులు 3,277
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో కరోనా మహమ్మారికి మరో 128 మంది బలికాగా, 3,277 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 62,939కు, మృతుల సంఖ్య 2,109కు చేరిందని కేంద్రం తెలిపింది. 19,357 మంది కోలుకున్నారనీ, రికవరీ రేటు 30.75 శాతంగా ఉందని పేర్కొంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 128 మంది కోవిడ్‌తో చనిపోగా అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 48 మంది మృతి చెందినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు