విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం

25 Jun, 2019 04:22 IST|Sakshi

భారతీయులు దాచినట్లుగా గుర్తింపు

తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయులు తమ నల్లధనాన్ని భారీ మొత్తంలో విదేశాల్లో దాచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమైంది. ఇదంతా కేవలం 1980–2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ ఫైనాన్స్‌ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్‌ కమిటీ నివేదికను సోమవారం లోక్‌సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి.

భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్‌ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. 1980–2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్‌సీఏఈఆర్‌ తన అధ్యయనంలో వెల్లడించింది. 1990–2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్‌ఐఎఫ్‌ఎమ్‌ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది. అయితే నల్లధనానికి సంబంధించి ఈ మూడు సంస్థల నివేదికలు ఒకేలా ఉంటాయని భావించలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారని పార్లమెంటరీ ప్యానల్‌ తన నివేదికలో వెల్లడించింది. దీనిని ప్రాథమిక నివేదికగానే భావించాల్సి ఉందని.. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా