మూడు తరాలను పీడిస్తున్న పీడకల

3 Dec, 2018 04:52 IST|Sakshi
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మృతులకు నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు, బాధిత బాలలు

భోపాల్‌ దుర్ఘటనకు 34 ఏళ్లు

ఇప్పటికీ తగ్గని విష ప్రభావం

మహి సైని... వయసు మూడేళ్లు.. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యం ఆ పాపను మంచానికే పరిమితం చేసింది. అందరిలా నడవలేదు. ఏ పనికీ చేతుల్ని ఉపయోగించలేదు. సైని తల్లి పింకి వయసు
22 సంవత్సరాలు. ఆమె కూడా శారీరక, మానసిక దుర్బలురాలే.  

ఆలియా... వయసు 12 ఏళ్లు. ఆమె పరిస్థితి కూడా ఇంతే. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది.

వీరి దుస్థితికి కారణం... 34 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్‌ విషవాయు దుర్ఘటన. ఆనాటి ప్రమాదంలో విడుదలయిన విషవాయువును పీల్చిన వారి సంతానం కావడమే వీరు చేసిన పాపం.మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ప్రమాదం ఫలితాలు మూడు తరాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాటి దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు.వారి పిల్లల పిల్లలపైనా ఆ విషం ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ నెలకు పాతిక, ముప్పయి మంది ఆ కారణంగానే చనిపోతున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. భోపాల్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం కోసం భోపాల్‌లోని లోయర్‌ లేక్‌ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ పిల్లలంతా పాల్గొన్నారు. ‘భోపాల్‌ దుర్ఘటన మూడు తరాలుగా వెంటాడుతోంది. ప్రమాద ప్రాంతంలో ఉంటున్న వారు, వారి పిల్లలు పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొందరు శారీరకంగా ఇబ్బందులు పడుతోంటే మరి కొందరు మానసిక రోగులుగా మారారు.’అంటూ ఆవేదన వెలిబుచ్చారు రషీదా బీ, చంపాదేవి.భోపాల్‌ దుర్ఘటన బాధితుల పిల్లల కోసం వారు చింగరి ట్రస్ట్‌ పేరుతో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నారు.

ఈ దుర్ఘటన ప్రభావంతో శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టిన 12 ఏళ్ల లోపు పిల్లలకు ఇక్కడ ఆశ్రయం కల్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ 961 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ ఏదోరకంగా భోపాల్‌ దుర్ఘటనతో సంబంధం ఉందని చంపాదేవి చెప్పారు. విషవాయు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల భూగర్భజలాలు విషపూరితమయ్యాయి. మునిసిపల్‌ నల్లాలు లేకపోవడంతో ఆక్కడి ప్రజలు ఇప్పటికీ ఆ నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు.  అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులకు సరైన చికిత్స అందడం లేదు.

బాధితులకు తప్పుడు వైద్యం
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులకు వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగాయని, దాని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని‘భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ,ఆఫ్టర్‌ 3 ఇయర్స్‌’పేరుతో వచ్చిన పుస్తకంలో వెల్లడించింది. 1984,డిసెంబర్‌ 2వ తేదీ అర్థరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో విషవాయువు లీకయింది. మిథైల్‌ ఐసోసైనేడ్‌ (మిక్‌) అనే ఆ విషవాయువు పట్టణమంతా కమ్ముకుంది.8 వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వందల మంది ఆస్పత్రుల్లో చనిపోయారు.5లక్షల మందికిపైగా విషవాయు ప్రభావానికి గురయ్యారు (అప్పటి భోపాల్‌ జనాభా 8.5 లక్షలు). ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ దుర్ఘటన గురించి తెలియగానే జర్మనీకి చెందిన వైద్య నిపుణుడు హుటాహుటిన ప్రమాద స్థలికి వచ్చారు. బాధితులను పరీక్షించారు. మిక్‌ గ్యాస్‌కు విరుగుడుగా సోడియం థియోసల్ఫేట్‌ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించారు.అయితే,కొన్ని రోజులకే దీన్ని వాడటం ఆపేశారు.కార్బైడ్‌ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ మందు ఆపేశారని, దాంతో బాధితులకు సరైన చికిత్స అందకుండా పోయిందని ఆ పుస్తకంలో వివరించారు.

 

మరిన్ని వార్తలు