పర్యాటకంలో 3.8 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌!

15 Apr, 2020 16:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా పరిగణించే ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను గత నెలలోనే మూసివేశారంటే దేశ పర్యాటక రంగంపై కోవిడ్‌–19 ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించవచ్చు. ఎక్కడైనా ప్రయాణం, పర్యాటన రంగం పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తాయి. కరోనా వైరస్‌ కట్టడి చేయడంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, ఆంక్షల వల్ల దేశ పర్యాటక రంగానికి గడ్డు కాలం దాపురించిందని ఏప్రిల్‌ పదవ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశ శ్రామిక శక్తిలో 70 శాతాన్ని ఆక్రమించిన పర్యాటక, దానికి అనుబంధ ఆతిథ్య రంగాల్లో 3.8 కోట్ల మంది శ్రామికులు ఉపాధి కోల్పోనున్నారని ఆర్థిక సర్వీసులు, వ్యాపార సలహా సంస్థ అయిన కేపీఎంజీ ఏప్రిల్‌ ఒకటవ తేదీన విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. (ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు)

పర్యటన, పర్యాటక రంగాలపై ఆధారపడి బతుకుతున్న దాదాపు 90 లక్షల మంది ఉపాధి కోల్పోయే ఆస్కారం ఉందని, ఇది గోవా జనాభాకన్నా ఆరింతలు ఎక్కువని పర్యాటక రంగంపై అంతర్జాతీయంగా అవగాహన కల్పించే ‘వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌’ హెచ్చరించింది. కేంద్ర పర్యాటక శాఖ 2019–2020లో విడుదల చేసిన వార్శిక నివేదిక ప్రకారం 2018–19 సంవత్సరం నాటికి దేశంలో 8.70 కోట్ల మంది పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. దేశంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 12.75 శాతం. ఇందులో 5.56 శాతం మంది ప్రత్యక్షంగా పర్యాటక రంగంపైనే ఆధారపడి బతుకుతుండగా, మిగతా 7.19 శాతం మంది ప్రజలు పరోక్షంగా బతుకుతున్నారు. ప్రయాణ రంగానికి అనుబందంగా పేర్కొనే కార్పొరేట్‌ సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు నిలిచి పోవడం వల్ల భారీ నష్టం వాటిల్లనుందని ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇకోమీ ట్రావెల్‌ సర్వీసెస్‌’ అధిపతి ఉన్మేశ్‌ వైద్య ఆందోళన వ్యక్తం చేశారు. (లాక్‌డౌన్‌ సడలించే రంగాలు ఇవే..)

తాము ఈ కార్పొరేట్‌ సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో రాయితీలపై పర్యాటక ట్రిప్పులను ఏర్పాటు చేస్తామని, ఇప్పుడవన్నీ నిలిచి పోయాయని ఆయన తెలిపారు. పర్యాటకుల బుకింగ్‌లను రద్దు చేయడం కోసం తమ ఉద్యోగులు కొంత మంది ఇంటి నుంచి పని చేస్తున్నారని చెప్పారు. మిగతా వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలంటే 30,40 శాతం జీతాల్లో కోత విధించాల్సి వస్తుందని ముందే హెచ్చరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. మే 3వ తేదీ వరకు దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల పర్యాటక, ప్రయాణ రంగాలు తీవ్రంగా దెబ్బ తింటాయని, ఈ రంగాలు పూర్తిగా కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడే చెప్పలేమని పలు ట్రావెల్‌ సంస్థలు వాపోతున్నాయి.

మరిన్ని వార్తలు