35 కి 38 మార్కులు, అలా ఎలా వచ్చాయంటే...

9 Jun, 2018 11:18 IST|Sakshi

పాట్నా : బిహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు మరోసారి వివాదంలో పడింది. టాపర్స్‌ స్కాం చోటు చేసుకున్న రెండేళ్ల అనంతరం, మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కొంతమంది క్లాస్‌ 12 విద్యార్థులకు మొత్తం(టోటల్‌) మార్కుల కంటే అ‍త్యధికంగా వేసినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకైతే, ఏకంగా ఎగ్జామ్‌కు హాజరు కాకపోయినా.. మార్కులు వేశారు. అర్వాల్‌ జిల్లాకు చెందిన భీమ్‌ కుమార్‌ అనే విద్యార్థి... మ్యాథమేటిక్స్‌ థియరీలో మొత్తం(టోటల్‌) 35 మార్కులకు 38 మార్కులు పొందాడు. అదేవిధంగా అబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్‌ పేపర్‌లో కూడా తనకు 35కు 37 మార్కులు వచ్చినట్టు ఆ విద్యార్థి చెప్పాడు. మార్కులు చూసుకుని తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయనని, ఇలాంటి ఘటనలు కేవలం స్టేట్‌ బోర్డు ఎగ్జామ్స్‌లో మాత్రమే జరుగుతాయని పేర్కొన్నాడు.

భీమ్‌ కుమార్‌తో పాటు సందీప్‌ రాజ్‌కు కూడా ఇదే విధంగా ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చినట్టు తెలిసింది. ఫిజిక్స్‌ థియరీ పేపర్‌లో తనకు 35 మార్కులు గాను, 38 మార్కులు వేసినట్టు చెప్పాడు. ‘ఇది ఎలా సాధ్యమవుతుంది. ఇంగ్లీష్‌, రాష్ట్ర భాషలో అబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్‌ పేపర్‌లో నాకు జీరో మార్కులు వచ్చాయి’ అని అన్నాడు. రాహుల్‌ అనే మరో విద్యార్థికి కూడా మ్యాథమేటిక్స్‌లో అబ్జెక్టివ్‌ పేపర్‌లో 35 మార్కులకు 40 మార్కులు వేశారని తెలిసింది. మరికొంత మంది విద్యార్థులు తాము కనీసం పరీక్షకు హాజరుకాకపోయినా.. ఆ సబ్జెట్లలో మార్కులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇలా తప్పులుతడకలుగా మార్కులు వేసి, బిహార్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు మరోసారి బజారు పాలైంది.

మరిన్ని వార్తలు