ముంబై అతలాకుతలం

3 Jul, 2019 03:23 IST|Sakshi
కూలిన గోడ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు. (ఇన్‌సెట్లో) కుటుంబీకులను కోల్పోయి రోదిస్తున్న ఓ వృద్ధురాలు

గోడ కూలి 21 మంది మృతి

మహారాష్ట్ర వ్యాప్తంగా 39 మంది దుర్మరణం

ముంబైలో వర్షాలతో స్తంభించిన రవాణా సేవలు

విమానాలు, రైళ్ల రద్దు

సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్‌లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి.

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్‌ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్‌ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్‌లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు.

ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్‌పోర్ట్‌ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  

203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు
మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్‌లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు.

మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్‌ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్‌పీఎఫ్‌ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్‌ రైలు సేవలు చర్చిగేట్, విరార్‌ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది.

పుణేలోనూ ఆరుగురు..  
ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్‌లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్‌ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్‌ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్‌ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ చవాన్‌ డిమాండ్‌ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్‌ కూడా నీట మునిగిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

అదే స్ఫూర్తి..
భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్‌ రోడ్‌ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్‌ పంపండి’ అని బిభాష్‌ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు.

విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్‌ సూపర్‌ హీరోలు అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఓ ట్వీట్‌ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం.


ముంబై విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూ భారీ వర్షం ధాటికి రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన విమానం


ఘట్కోపర్‌లో వరదతో నిండిన రోడ్డు


ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా