గూఢచర్యానికి ఐఎస్ఐ వాడుకుంటున్న దారిదే!

3 May, 2016 18:01 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) భారతీయ రక్షణ వ్యవస్థపై నిఘా ఉంచుతుందన్న విషయం తెలిసిందే. కానీ, ఏ పద్ధతిలో రక్షణ వివరాలను సేకరిస్తోందో తెలిస్తే షాక్ అవకుండా ఉండలేం. ప్రస్తుతం లేవగానే అది లేకుండా బతకలేం అనిపించే మొబైల్ ఇందుకు సాధనంగా వాడుతున్నట్లు లోక్ సభ సమావేశాల్లో హోం శాఖ మంత్రి హరిభాయ్ పటేల్ చౌదరి తెలిపారు.

భారత రక్షణ వ్యవస్థలో పనిచేసి రిటైరయిన వారికి ఉద్యోగం, డబ్బు తదితరాలను ఆశ చూపి గూడచర్యానికి ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని రకాలైన వైరస్ తో ఆండ్రాయిడ్ ఆప్ లను తయారు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. టాప్ గన్(ఆటల యాప్), ఎమ్పీ జుంకీ(మ్యూజిక్ యాప్), వీడీ జంకీ(వీడియో యాప్), టాకింగ్ ఫ్రాగ్(ఎంటర్టైన్ మెంట్ యాప్)లలో వైరస్ ను ఉపయోగించి అధికారులను ఆకర్షిస్తున్నారని ఆయన చెప్పారు.

2013 నుంచి 2016 మధ్యకాలంలో ఏడుగురు రిటైర్డ్ ఉద్యోగులు ఐఎస్ఐకు సమాచారం అందిస్తూ దొరికిపోయినట్లు తెలిపారు. ఐఎస్ఐ స్మార్ట్ ఫోన్లను పావుగా వాడుకుంటుడాన్ని భారత భద్రతా సిబ్బంది పసిగట్టిందని ఆయన వివరించారు. ప్రభుత్వ సంస్థలన్నింటికి కంప్యూటర్ సెక్యూరిటీ పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ దాడులను ఉద్యోగులు, అధికారలు సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా చేశామని, అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు చౌదరి తెలిపారు.

మరిన్ని వార్తలు