‘ఉపాధి’ అమల్లో రాష్ట్రానికి 4 అవార్డులు

3 Feb, 2016 03:32 IST|Sakshi
‘ఉపాధి’ అమల్లో రాష్ట్రానికి 4 అవార్డులు

ఢిల్లీలో జరిగిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ 10వ వార్షికోత్సవంలో ప్రదానం
అవార్డులు అందుకున్న ఉన్నతాధికారులు ఎస్పీసింగ్, అనితా రాంచంద్రన్

 
 సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అమల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రానికి నాలుగు అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉపాధి హామీలో సామాజిక విలీనం (సోషల్ ఇన్‌క్లూజన్), పారదర్శకత-జవాబుదారీతనం (ట్రాన్స్‌పరెన్సీ-అకౌంటబిలిటీ), ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించిన జిల్లా, ఉపాధి పనులు చేసుకున్న ఉత్తమ గ్రామం కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి.

ఢిల్లీలో మంగళవారం జరిగిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ 10వ వార్షికోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, గ్రామీణాభివృద్ధి విభాగం డెరైక్టర్ అనితా రాంచంద్రన్, సోషల్ ఆడిట్ విభాగం డెరైక్టర్ సౌమ్య కిడాంబి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, కరీంనగర్ జిల్లా చందుర్తి గ్రామ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ అవార్డులను అందుకున్నారు. ఉపాధి కూలీ స్థాయి నుంచి రైతు స్థాయికి ఎదిగిన మెదక్ జిల్లా రాఘవపూర్‌కు చెందిన కొమ్మిడి వెంకట్రామిరెడ్డిని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఉపాధి హామీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన వారిలో గ్రామీణాభివృద్ధి విభాగం జాయింట్ కమిషనర్ సైదులు, పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు.

 ఆంధ్రప్రదేశ్‌కూ అవార్డులు...
 ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ చేతుల మీదుగా ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు అవార్డులను అందుకున్నారు. అలాగే ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేసినందుకు వైఎస్సార్ జిల్లా అత్యుత్తమ జిల్లా అవార్డు గెలుచుకుంది. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కె.వి.రమణ, జిల్లా ప్రాజెక్డు డెరైక్టర్ బాలసుబ్రమణ్యం ఈ అవార్డులను అందుకున్నారు. దీంతోపాటు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని జరుగు గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఉత్తమ సేవలకుగాను ఏపీలో తపాలాశాఖకూ రెండు అవార్డులు దక్కాయి.

మరిన్ని వార్తలు