దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ

1 Jul, 2020 11:21 IST|Sakshi

జూన్‌ మాసంలో నాలుగు లక్షల పాజిటివ్‌ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా.. వైరస్‌ను కట్టడి చేయడంలో అవన్నీ విఫలమైనట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేసిన అనంతరం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. ఒక్క జూన్‌ నెలలోనే నాలుగు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయంటే వైరస్‌ విజృంభణ ఏ విధంగా ఉందో తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. దేశంలో జనవరి 31న తొలి కరోనా కేసు నమోదైనా.. మార్చినాటికి అంతగా వ్యాప్తి చెందలేదు. లాక్‌డౌన్‌ విధింపు, భౌతిక దూరం పాటించడంతో వైరస్‌ను కట్టడిచేశామనే భావన తొలుత అందరిలోనూ కలిగింది. అయితే మే మూడో వారం నుంచి పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌కు మే నాటికి విడతల వారీగా సడలించడం, శ్రామిక్‌ రైళ్లు ప్రారంభించడం, వలస కూలీల తరలింపు వంటి నిర్ణయాలతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగింది. (కరోనా కల్లోలం.. పెరుగుతున్న మరణాలు)

కేంద్ర గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో మొత్తం 33,248 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య మే మాసంలో 1,50,195గా పెరిగింది. ఇక జూన్‌ నెల ముగిసే నాటికి దేశంలో కరోనా వైరస్‌ జూలు విదిల్చింది. ఒక్క నెలలోనే ఏకంగా నాలుగు లక్షలకు పైగా (4,00,414) కరోనా కేసులు నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్యా అదే రీతిలో పెరుగుతోంది. ఏప్రిల్‌లో 1105 మరణాలు సంభవించగా.. మే లో 4267, జూన్‌లో 11,988 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  మరణాల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. మే చివరినాటికి లాక్‌డౌన్‌ నిబంధనాలు పూర్తిగా ఎత్తివేయడంతో వ్యక్తిగత, సామాజిక వ్యవహార శైలిలో జనజీవనం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. (అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది!)

వైరస్‌ తొలినాళ్లలో ప్రజలు చూపిన జాగ్రత్తలు, భౌతిక దూరం నిబంధనలు ఇప్పుడు పాటించడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని, కంటైన్‌మెంట్‌ జోన్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రధాని సూచించారు. మరోవైపు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులోనే అత్యధిక భాగం నమోదవడం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫ్లాస్మా థెరపీ చికిత్సతో మొదట్లో కొంత కుదుటపడ్డా.. పెరుగుతున్న కేసులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక గడిచిన మూడు రోజులుగా కరోనా తమిళనాడు వాసులకు కంటిమీదు కనుకులేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 1201 మంది మృత్యువాత పడ్డారు.

>
మరిన్ని వార్తలు