‘సంజువాన్‌’ దాడిలో ఆరుగురి మృతి

12 Feb, 2018 01:51 IST|Sakshi
సంజువాన్‌ మిలటరీ స్టేషన్‌లో అప్రమత్తంగా ఉన్న సైనికులు

 వారిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది

కొనసాగుతున్న సోదాలు  

సంజువాన్‌: జమ్మూ నగర శివార్లలోని సంజువాన్‌లో ఆర్మీ కుటుంబాలు నివసించే గృహసముదాయంలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. క్వార్టర్స్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు మిగిలిఉన్నారేమోనన్న అనుమానంతో సైన్యం సోదాలు కొనసాగిస్తోంది.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారని అధికారులు శనివారం చెప్పగా.. తాజా సమాచారం ప్రకారం ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారని వెల్లడించారు. ఓ మేజర్‌ సహా 10 మంది గాయపడ్డారని ఆదివారం చెప్పారు. చనిపోయిన వారిలో ఇద్దరు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్స్‌ (జేసీవో) ఉన్నారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు శనివారం ఆర్మీ క్వార్టర్స్‌లోకి సైనిక దుస్తుల్లో ప్రవేశించి దాడి చేయడం తెలిసిందే.

మరో నాలుగు మృతదేహాలు లభ్యం
ఇప్పటికి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టగా శనివారం రాత్రి నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదనీ, అయినా ఇంకా ఎక్కడైనా ముష్కరులు దాగి ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తొలుత ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలు లభించగా, క్వార్టర్స్‌ను శుభ్రం చేస్తుండగా మరో ముగ్గురు సిబ్బంది, ఒక పౌరుడి మృతదేహం కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ ఆరుగురూ శనివారం తెల్లవారుజామునే చనిపోయారన్నారు.

సుబేదార్‌ మదన్‌ లాల్‌ చౌదరి, సుబేదార్‌ మహ్మద్‌ అష్రఫ్‌ మిర్, హవిల్దార్‌ హబీబ్‌ ఉల్లా ఖురేషీ, నాయక్‌ మంజూర్‌ అహ్మద్, లాన్స్‌ నాయక్‌ ఇక్బాల్‌తోపాటు ఇక్బాల్‌ తండ్రి కూడా మరణించారనీ చెప్పారు. మదన్‌ లాల్‌ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఒట్టి చేతులతోనే ఉగ్రవాదులతో పోరాడాడనీ, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు చొచ్చుకుపోయినా కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడన్నారు. గాయపడిన వారిలో ఓ మహిళ గర్భవతి కాగా, వైద్యులు ఆమెకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి తల్లీ బిడ్డలను కాపాడగలిగారు.  

క్వార్టర్స్‌పై బాంబులు
క్వార్టర్స్‌ నుంచి ఇప్పటికే ఆర్మీ కుటుంబాలను ఖాళీ చేయించిన ఇళ్లపై ఆర్మీ మోర్టారు బాంబులను వేసింది. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా దాక్కొని ఉంటే వారినీ హతమార్చేందుకే ఈ చర్యకు పూనుకుంది. దీంతో ఆర్మీ క్వార్టర్స్‌కు మంటలంటుకున్నాయి. మరోవైపు ఈ దాడి పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనేనన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. విచారణ కూడా ప్రారంభం కాకుండానే తమపై ఆరోపణలు చేయడం భారత మీడియాకు, అధికారులకు అలవాటైపోయిందని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.  

మరిన్ని వార్తలు