నలుగురు ఎంపీలు ఆస్పత్రిపాలు

13 Feb, 2014 17:19 IST|Sakshi

పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చెయ్యడం, తర్వాత ఇతర సభ్యులు కొంతమంది సభ్యులను కొట్టడం లాంటి సంఘటనల నేపథ్యంలో నలుగురు ఎంపీలు ఆస్పత్రి పాలయ్యారు. వాళ్లలో ముగ్గురు కేవలం కళ్లు మంటల లాంటి చిన్న చిన్న సమస్యలతోనే రాగా... మరో ఎంపీ కొనకళ్ల నారాయణ మాత్రం గుండెపోటుకు గురయ్యారు. రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేసిన తర్వాత పలువురు ఎంపీలు దగ్గుతూ, కళ్ల వెంబడి నీళ్లు కార్చుకుంటూ బయటకు వెళ్లారు. ముగ్గురు ఎంపీలు మాత్రం బాగా అసౌకర్యంగా ఉండటంతో వారిని సమీపంలో ఉన్న రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాత్రం తనకు గుండెల్లో నొప్పిగా, ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆయనను వైద్యులు పరీక్షించి చూడగా ఆయనకు బీపీ, పల్స్ రేటు రెండూ బాగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే ఆయనను కరొనరీ కేర్ యూనిట్కు తరలించి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్కె కర్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వారం రోజుల క్రితమే హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేశారని, బైపాస్ సర్జరీ చేయించుకోవాలని చెప్పారని డాక్టర్ కర్ తెలిపారు. ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆయనకు స్టెంట్లు వేయాలా లేక సర్జరీ చేయాలో చూస్తామన్నారు. ఆయన పరిస్థితిని కార్డియాలజిస్టుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని వివరించారు.

నారాయణతో పాటు ఎంపీపొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఎంపీ  వినయ్ కుమార్ పాండేలను పార్లమెంటు నుంచి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. వారికి కళ్లు మంటలు, ఊపిరి సరిగా అందకపోవడం, చర్మం మీద ఇబ్బంది ఉన్నట్లు చెప్పారు. కంటి వైద్య నిపుణులు, చర్మ వైద్య నిపుణులు వారికి చికిత్స చేశారు. మందులిచ్చి, మధ్యాహ్నం 2.20 గంటలకల్లా డిశ్చార్జి చేశారు.

మరిన్ని వార్తలు