భారత సైన్యంపై పాక్‌ కాల్పులు

24 Dec, 2017 02:12 IST|Sakshi

మేజర్‌ సహా నలుగురి దుర్మరణం

జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్‌లో రాజౌరీ జిల్లాలోని కేరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి గస్తీకాస్తున్న భారత జవాన్లపై పాక్‌ సైన్యం శనివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో మేజర్‌ మోహర్కర్‌ ప్రఫుల్ల అంబాదాస్‌(32), లాన్స్‌నాయక్‌ గుర్మైల్‌ సింగ్‌(34), సిపాయ్‌ పర్గత్‌ సింగ్‌(30)లతో పాటు మరో జవాన్‌ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు. పాక్‌ కాల్పుల్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. ‘మేజర్‌ అంబదాస్, లాన్స్‌నాయక్‌ గుర్మైల్, సిపాయ్‌ పర్గత్‌లు అసమాన ధైర్యం, నిజాయితీలున్న సైనికులు.

విధి నిర్వహణలో వారి అంకితభావానికి, ప్రాణత్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. అంబదాస్‌ మహారాష్ట్రలోని భందారాకు చెందినవారు కాగా.. గుర్మైల్‌ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, పర్గత్‌ కుటుంబం హరియాణాలోని కర్నాల్‌ జిల్లాలో ఉంటోంది. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం మెహబూబా ముఫ్తీ రాజౌరీ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాక్‌ కాల్పులు జరపడం గమనార్హం. మరోవైపు పాక్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు కశ్మీర్‌ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్‌ నివాళులర్పించారు. పాక్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా ప్రపంచం గుర్తించిందన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు దీటుగా బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రస్తుతం ఏకాకీగా మారిందని సింగ్‌ ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు