కొత్తగా 4వేల పీజీవైద్య సీట్లు

3 Mar, 2017 02:00 IST|Sakshi
కొత్తగా 4వేల పీజీవైద్య సీట్లు

కేంద్రం ఆమోదం
► మార్చి ముగిసేలోపు మరో వెయ్యికి అవకాశం
న్యూఢిల్లీ: 2017–18 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా నాలుగు వేల కొత్త పీజీ వైద్య విద్య సీట్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా గురువారం చెప్పారు. వీటితో కలిపి దేశంలోని మొత్తం పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య 35,117కు చేరనుంది. వైద్య విద్య అభివృద్ధికి ఈ సీట్ల పెంపు తోడ్పడుతుందని నడ్డా అన్నారు. దేశంలో వైద్య నిపుణుల సంఖ్యను పెంచేందుకుగాను ప్రతి ఏడాది 5,000 కొత్త పీజీ వైద్య సీట్లను మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమయంలో ప్రకటించడం తెలిసిందే.

సీట్ల పెంపు కోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని క్లినికల్‌ సబ్జెక్టుల్లో అధ్యాపకుడు, విద్యార్థుల నిష్పత్తిలో మార్పులు చేసినట్లు నడ్డా వెల్లడించారు. ఆ మార్పుల వల్ల 1,137 కొత్త సీట్లు లభించాయనీ, మార్చి ముగిసేలోపు మరో వెయ్యి సీట్లు పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఎండీ/ఎంఎస్‌లకు సమానమైన డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (డీఎన్ బీ) కోర్సుల్లో గత ఏడాది కాలంలో మొత్తంగా 2,147 సీట్లను పెంచారు. ఇప్పుడు చెబుతున్న నాలుగు వేల సీట్లలో ఈ 2,147 సీట్లు కూడా కలసి ఉన్నాయి. మొత్తం మీద 2017–18 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు కొత్తగా లభించినట్లు నడ్డా తెలిపారు.

మరిన్ని వార్తలు