ఐదేళ్లలో 4వేల మెగావాట్ల ఉత్పత్తి

13 Feb, 2016 02:12 IST|Sakshi
ఐదేళ్లలో 4వేల మెగావాట్ల ఉత్పత్తి

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేగంగా పూర్తిచేస్తాం
సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ
బీహెచ్‌ఈఎల్ వద్ద ఉన్న 4 యూనిట్లు రాష్ట్రానికి అందించడానికి అంగీకారం

 
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం వద్ద ఎన్టీపీసీ నిర్మించనున్న 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదేళ్లలోగానే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు.  తెలంగాణలో మరిన్ని సోలార్ పార్క్‌లను ఏర్పాటుకు అనుమతివ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను కలసి పలు అంశాలపై చర్చించారు.
 
 ఆయన వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పి.రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ... రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రెండు 800 మెగావాట్ల యూనిట్లకు టెండర్లు పూర్తయ్యాయని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మరో మూడు 800 మెగావాట్ల యూనిట్లను కూడా నిర్మిస్తామని...  2021వ సంవత్సరం నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.
 
 ఈ యూనిట్ల ఏర్పాటుకు 600 ఎకరాల భూమి అవసరమని, కొంత భూమి రైల్వేలైన్ విస్తరణకు అవసరమని... త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. టీ జెన్‌కో ప్రతిపాదించిన 1,080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు బీహెచ్‌ఈఎల్ వద్ద ప్రస్తుతమున్న 270 మెగావాట్ల 4 యూనిట్లను రాష్ట్రానికి అందించాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్ర మంత్రి గోయల్ చెప్పారు. తద్వారా ఖమ్మం జిల్లాలోని మణుగూరులో యూనిట్లను రెండేళ్లలోగా ఏర్పాటు చేయవచ్చని, ఈలోగా పర్యావరణ అనుమతులను పొందాల్సి ఉంటుందని తెలిపారు.
 
 2,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. భవిష్యత్తులో మరిన్ని సోలార్ పార్క్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో కొత్తగా 5,880 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అభినందనీయమని చెప్పారు. ఈ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీకి సంబంధించి కొత్త విధానాన్ని ఖరారు చేస్తున్నామని.. అది ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిష్కరిస్తామని చెప్పారు. తాడిచెర్ల-1 కోల్‌బ్లాక్‌ను టీజెన్‌కోకు కేంద్రం గతేడాదే కేటాయించిందని, బొగ్గు ఉత్పత్తికి కొంత సమయం పడుతుందని తెలిపారు. తాత్కాలికంగా 2.5 మిలియన్ టన్నుల కోల్ లింకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని... అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశామని గోయల్ చెప్పారు.

మరిన్ని వార్తలు