నరకలోకపు రహ‘దారులు’

12 Sep, 2018 02:02 IST|Sakshi
రాష్ట్రాలవారీగా ప్రమాదాల శాతం

రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 413 మంది మృతి

2016లో సగం మరణాలు అతివేగం వల్లే

ప్రపంచంలో చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 2016లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,50,785 మంది మరణించారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, తమిళనాడులు ముందు వరుసలో ఉన్నాయి. 2016తో పోల్చుకుంటే 2017లో రోడ్డు ప్రమాదాలు 3.27 శాతం తగ్గినా.. 2018 తొలి మూడు నెలల్లోనే 1.68 శాతం పెరగడం గమనార్హం . 2017లో 1.47 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా.. అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ జనాభాతో సమానం. అతివేగం, హెల్మెట్, సీటు బెల్ట్‌ ధరించకపోవడం, మొబైల్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటివి వేలాది మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి.  

2016లో సగటున రోజుకి 1,317 ప్రమాదాలు జరిగితే 413 మంది ప్రాణాలు కోల్పోయారు. గంటకి 55 ప్రమాదాలు నమోదు కాగా 17 మంది మరణించారు. 2015లో ప్రతీ 100 ప్రమాదాల్లో 29 మంది మరణిస్తే.. 2016లో అది 31 శాతానికి పెరిగింది. మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 34.5 శాతం జాతీయ రహదారులపై, 27.9 శాతం రాష్ట్ర రహదారులపై సంభవిస్తున్నాయి. జిల్లా, స్థానిక రోడ్లపై 37.6 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ప్రమాదాలకు అతి వేగమే ప్రధాన కారణంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదిక వెల్లడించింది. మొత్తం ప్రమాదాల్లో అతివేగం వల్ల జరుగుతున్నవి 66.5 శాతంగా ఉన్నాయి. మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం కూడా మరో ప్రధాన కారణంగా తేల్చారు. 2016లో మొబైల్‌ ఫోన్‌లు మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల 5000 ప్రమాదాలు జరిగితే.. 2000 మంది మరణించారు.

రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 12.8 శాతం రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. తమిళనాడులో 11.4 శాతం, మహారాష్ట్రలో 8.6, కర్నాటకలో 7.4 శాతం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చెన్నై రోడ్లు అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2016లో 7,486 ప్రమాదాలు ఒక్క చెన్నైలోనే జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అక్కడ 7,375 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెంగుళూరు, ఇండోర్, కోల్‌కతాలు ఉన్నాయి.


2016లో రోడ్డు ప్రమాదాల తీరిదీ..
ప్రమాదానికి కారణం            ప్రమాదాల సంఖ్య
అతివేగం                                73,896
ఓవర్‌టేక్‌                                  9,562
మద్యం తాగి వాహనాలు నడిపి     6,131
రాంగ్‌సైడ్‌ వల్ల                           5,705
సిగ్నల్‌ జంప్‌                            4,055
డ్రైవర్ల తప్పిదం/అనారోగ్యం           1,796
హెల్మెట్‌ ధరించకపోవడం           10,135
సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండా               5,638

వయసు                  మృతులు
18–35 ఏళ్లు              69,851
35–45 ఏళ్లు              33,558
45–60 ఏళ్లు              22,174
18 ఏళ్ల లోపు             10,622
60 ఏళ్లు పైబడిన వారు   8,814  
వయసు తెలియని వారు  5,766

>
మరిన్ని వార్తలు