4500 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టాం: రైల్వే శాఖ

16 Dec, 2016 16:41 IST|Sakshi
4500 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టాం: రైల్వే శాఖ

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల తీవ్రతను తగ్గించేలా రూపొందించబడిన రైలు కోచ్‌లు.. లింకే హోఫ్‌మన్‌ బుచ్‌(ఎల్‌హెచ్‌బీ)లను విస్తరిస్తున్నామని.. ఇప్పటి వరకు ఈ తరహా కోచ్‌లు 4500 భారత రైల్వేలో ప్రవేశపెట్టామని రైల్వే శాఖ వెల్లడించింది. శుక్రవారం రాజ్యసభలో వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహైన్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రైల్వే భద్రతపై ఏర్పాటైన అనిల్‌ కకోద్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను సిఫారసు చేసిందని, ఆ సిఫారసును ప్రభుత్వం ఏ మేరకు అమలు చేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఇచ్చిన సమాధానంలో.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైలు ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని.. వీటిలో బాడీ-బోగి, వీల్‌-బోగి కనెక్షన్‌ బాగుండటంతో పాటు.. యాంటీ క్లైంబింగ్‌ ఫీచర్‌ సైతం ఉందని తెలిపిన రాజెన్‌ గోహెల్‌.. వీటి సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. అలాగే రాకేష్‌ మోహన్ కమిటీ సిఫారసు చేసిన అంశాల అమలును సైతం విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120 మందికి పైగా మృత్యువాత పడగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాద తీవ్రత పెరగడానికి ఐసీఎఫ్‌ తరహా కోచ్‌లు కూడా కారణమనే విమర్శలు వినిపించాయి.

మరిన్ని వార్తలు