ఒక్కొక్కరి ద్వారా 406 మందికి కరోనా 

8 Apr, 2020 03:13 IST|Sakshi

భౌతిక దూరం పాటిస్తే 2.5 మందికి మాత్రమే

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

24 గంటల్లో 508 కొత్త కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో కోవిడ్‌ రోగి నెల రోజుల్లో కనీసం 406 మందికి వ్యాధిని అంటిస్తాడని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక రోగి నుంచి ఎంతమందికి రోగం వ్యాప్తి చెందుతుందనేదాన్ని ఆర్‌–నాట్‌గా వ్యవహరిస్తారని, కోవిడ్‌–19 విషయంలో ఆర్‌–నాట్‌ 1.5 నుంచి 4.0 మధ్య ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేల్చారని వివరించారు. ఆర్‌–నాట్‌ 2.5 మాత్రమే ఉందని అనుకున్నా భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో రోగి నెల రోజుల్లో 406 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తాడని ఆయన లెక్కకట్టారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించి రోగి కదలికలను 75 శాతం వరకూ నియంత్రించగలిగితే మాత్రం ఒక్కో రోగి నుంచి మరో 2.5 మందికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ కారణంగానే దేశంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరమని ఆయన తెలిపారు.

దేశంలో మొత్తం 4,789 కేసులు... 
దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్‌ బారిన పడ్డ వారి సంఖ్య 4,789కు చేరుకుందని, మొత్తం 124 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కొత్త కేసులు బయటపడ్డాయని చెప్పారు.  మరణాల సంఖ్య పది అని అన్నారు. మరో 352 మంది చికిత్స తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడం లేదా వలస వెళ్లడం జరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,312గా ఉందని చెప్పింది. మొత్తం కేసుల్లో 66 మంది విదేశీయులు.గా తెలిపింది. గత 24 గంటల్లో మరణించిన ఎనిమిది మందిలో నలుగురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు మహారాష్ట్ర వారని, గుజరాత్, ఒడిశా, పంజాబ్‌ల నుంచి ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

కోవిడ్‌–19 ప్రభావం ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలు అనుకున్న ఫలితాలిస్తున్నాయని వివరించారు. పేషెంట్ల స్థితిని బట్టి చికిత్స అందించేందుకు మూడు రకాలుగా చికిత్స కేంద్రాలను వర్గీకరించామని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. వ్యాధి లక్షణాల తీవ్రత ఒక మోస్తరుగా మాత్రమే ఉన్న వారిని కోవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తరలిస్తామని, హాస్టళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలల వంటి ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలను కేర్‌ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని, ఇప్పటివరకూ క్వారంటైన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిని కూడా కేర్‌ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని వివరించారు. వ్యాధి లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉంటే  ఆరోగ్య కేంద్రాలకు రోగిని తరలిస్తామని, తీవ్రస్థాయిలో ఉండే కేసులను అత్యవసర సేవలందించే ఆసుపత్రుల్లో ఉంచుతామని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు