48 మందిని బలిగొన్న బస్సు

2 Jul, 2018 02:24 IST|Sakshi
ఉత్తరాఖండ్‌లోని ధూమకోట్‌ సమీపంలో బస్సు ప్రమాద స్థలంలో మృతదేహాలు

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పౌడీ జిల్లాలో లోయలో పడ్డ బస్సు

28 సీట్లుంటే 58 మందిని ఎక్కించి ప్రయాణం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్‌ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్‌ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్‌ రామ్‌ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో ఇంకా నిర్ధారించలేదనీ, రాం నగర్‌ వెళ్తున్న ఈ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారనేది మాత్రం స్పష్టమవుతోందని ఆయన తెలిపారు.

28 సీట్లున్న ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు 58 మంది ప్రయాణిస్తున్నారనీ, ఘటనా స్థలంలోనే 45 మంది మరణించగా, ధూమకోట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. గాయపడ్డ పది మందిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాం నగర్‌లోని వైద్యశాలకు తరలించారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రమాద స్థలిని పరిశీలించారు. దుర్ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ జరపాల్సిందిగా ఆయన ఆదేశించారు. మృతుల బంధువులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. రావత్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ ఫోన్‌లో మాట్లాడి, కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు.

నీటిగుంటే ప్రమాదానికి కారణమా?
ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద నీటి గుంటను డ్రైవర్‌ తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. బస్సు 200 మీటర్ల లోతుకి దొర్లుకుంటూ వెళ్లిన అనంతరం వాగులోకి పడిందని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారనీ, మృత దేహాలనన్నింటినీ బస్సులో నుంచి బయటకు తీశామని ఎస్పీ చెప్పారు.

ప్రముఖుల సంతాపం
ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలు సంతాపం తెలిపారు. ‘ప్రమాదం విచారకరం. మృతుల కటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ కోవింద్‌ ట్వీట్‌ చేశారు. మోదీ ట్వీట్‌ చేస్తూ ‘తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ క్రిష్ణకాంత్‌ పాల్‌ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు.
 

మరిన్ని వార్తలు