యూపీలో మరో గోరఖ్‌పూర్‌!

5 Sep, 2017 01:04 IST|Sakshi
యూపీలో మరో గోరఖ్‌పూర్‌!

ఫరూఖాబాద్‌లో నెల రోజుల్లో 49 మంది నవజాత శిశువుల మృతి
ఫరూఖాబాద్‌/లక్నో:
ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారుల మరణ మృదం గాన్ని మరవకముందే.. అదే రాష్ట్రంలోని ఫరూఖాబాద్‌ లోనూ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో గత నెల రోజుల వ్యవధిలో సుమారు 49 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. చాలా మంది చిన్నారులు ‘పెరినటల్‌ అస్ఫిక్సియా’ (ఊపిరి తీసుకోవడం కష్టమవడం) వల్లే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

30 మంది నెల రోజుల వయసున్న చిన్నారులు, మరో 19 మంది శిశువులు డెలివరీ సమయంలో మృతి చెందారు. ఈ మరణాలన్నీ జూలై 20 నుంచి ఆగస్టు 21 మధ్య సంభవించాయి. దీంతో ఫరూఖాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) ఉమాకాంత్‌ పాండే, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ (సీఎంఎస్‌) అఖిలేశ్‌ అగర్వాల్‌లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. సీఎంవో, సీఎంఎస్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్లే చిన్నారులు మృతి చెందారు.

అయితే, ఆక్సిజన్, మందులు అందించడంలో అధికారులు ఆలస్యం చేశారని, ఆక్సిజన్‌ సరిగ్గా సరఫరా చేయకపోవడం వల్లే తమ పిల్లలు చనిపోయారని బాధిత తల్లిదండ్రులు చెప్పారు’ అని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జిల్లా మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. కాగా, గత 24 గంటల్లో గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 24 మంది చిన్నారులు మరణించారని అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్తాన్‌లోని బన్స్‌వారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో గత రెండు నెలల్లో 90 మంది చిన్నారులు మృతి చెందడంతో ప్రభుత్వం ముగ్గురు వైద్యుల్ని సస్పెండ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు