49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

9 Jun, 2020 11:59 IST|Sakshi

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో ఉంప‌న్ తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న 49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. ప‌శ్చిమ బెంగాల్‌లో తుఫాను సృష్టించిన బీభ‌త్సం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డ రెస్యూ ఆప‌రేష‌న్ అనంత‌రం ఒడిశా తిరిగివ‌చ్చారు. వీరిలో జూన్ 3న ఒక‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వైర‌స్ సోకినట్లు తేలింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు బృందంలోని మిగ‌తా 173 మందికి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా 49 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. వీరంతా క‌ట‌క్‌లోని ముండ‌లి ప్రాంతానికి చెందిన 3వ బెటాలియ‌న్‌కు చెందినవార‌ని అధికారులు పేర్కొన్నారు. క‌రోనా వ‌చ్చిన వారిని ఎన్డీఆర్ఎఫ్ శిబిరంలోని క్వారంటైన్‌లో  ఉంచిన‌ట్లు తెలిపారు. అయితే ప‌శ్చిమ‌బెంగాల్‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా  ఒడిశా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన 376 మంది, ఒడిశా  రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 271 మంది కూడా పాల్గొన్న‌ట్లు వివ‌రించారు. వీరంద‌రి న‌మూనాలు ల్యాబ్‌కు పంపించామ‌ని ఫ‌లితాలు ఇంకా తెలియాల్సి ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు)

మ‌రోవైపు డీఆర్‌డీవో యూనిట్‌లోనూ కరోనా క‌ల‌క‌లం రేపుతోంది. బాలాసోర్ జిల్లాలోని ఈ సంస్థ‌లో మిలిట‌రీ విభాగానికి చెందిన ఇద్ద‌రు జ‌వాన్ల‌కు కోవిడ్ ఉన్న‌ట్లు తేలింది. వీరు ఇటీవ‌ల రెస్యూ ఆప‌రేష‌న్‌లో భాగంగా కోల్‌క‌తా వెళ్లారు. పిఎక్స్ఇ  సైనిక శిబిరానికి వెళ్ళిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) బృందంలోని  ఎనిమిది మంది జవాన్లు కోవిడ్ బారిన ప‌డ‌టంతో వారిని క్వారంటైన్ చేశారు.  ప్ర‌స్తుతం ఐటీఆర్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఉంప‌న్  తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు కేంద్రం 19 ప్ర‌త్యేక బృందాల‌ను ప‌శ్చిమ బెంగాల్‌కు పంపించింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డినుంచి తిరిగి వ‌చ్చిన బృందాల్లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆందోళ‌న మొద‌లైంది. (క‌రోనాపై తప్పుడు వార్తలకు ట్విటర్‌ చెక్‌ )

మరిన్ని వార్తలు