ముంబై పేలుళ్ల కేసులో కీలక తీర్పు

11 Sep, 2015 13:46 IST|Sakshi
ముంబై పేలుళ్ల కేసులో కీలక తీర్పు

1993 తర్వాత అంతటి భారీ స్థాయిలో దేశ ఆర్థిక రాజధాని ముంబైని వణికించిన 2006 నాటి బాంబు పేలుళ్ల కేసులో మోకా ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించింది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. గత ఏడాది ఆగస్టులో విచారణ ముగిసినప్పటికీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కోర్టు తీర్పును వెలువరించింది.  12 మందిని దోషులుగా తేల్చిన కోర్టు 5500 పేజీల సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరించామని తెలిపింది.  ప్రాసిక్యూషన్ తరపున 192 మందిని విచారించారు.  వీరిలో ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వైద్యులు ఉన్నారు.

2006 జులై 11న ముంబై మహా నగరం వరుస పేలుళ్లతో వణికిపోయింది. ముంబై సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర వాదులు వరుస పేలుళ్లు జరిపారు. ఖార్ రోడ్, బాంద్రా, మాతుంగా, మాహిమ్ జంక్షన్, జోగేశ్వరి, మీరా రోడ్, భయాందర్, బోరీవాలిల్లో 11 నిమిషాల తేడాలో  వరుస పేలుళ్లు జరిగాయి. సబర్బన్ ట్రైన్లలో మొదటి తరగతి కంపార్ట్‌మెంట్లలో జరిగిన ఈ దాడుల్లో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు.  కాలక్రమంలో మరో ఐదుగురు మరణించారు.

ఈ ఘాతుకానికి సంబంధించి యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్‌.. 15 మంది నిందితులను అరెస్టు చేసింది.  ఇదే కేసుకు సంబంధించి మరో పది మంది పరారీలో ఉన్నారు. కాగా మోకా కోర్టు తీర్పు నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. సిటీ అంతటా భారీగా పోలీసులను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు