5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

23 Apr, 2016 00:51 IST|Sakshi
5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

♦ మే 1న కొత్త పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
♦ ‘గివిట్ అప్’ డబ్బు ఈ పథకానికి వినియోగం
 
 న్యూఢిల్లీ:
దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా 5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెన్షన్లు ఇవ్వాలని కేంద్ర ం నిర్ణయించింది. దీనికి సంబంధించి రూ. 8 వేల కోట్లతో కొత్త పథకం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’కు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 1న ప్రధాని మోదీ దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రారంభించనున్నారు. మే 15న గుజరాత్‌లోని దహోడ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘గివిట్ అప్’ ప్రచారంతో స్వచ్ఛందంగా సబ్సిడీని త్యజించిన వినియోగదారుల ద్వారా వస్తున్న డబ్బును ఈ పథకానికి వినియోగిస్తారు.

ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది వినియోగదారులు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సబ్సిడీని వదులుకున్న రాష్ట్రాల జాబితాలో 14.44 లక్షలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్నారు. గివిట్ అప్‌తో ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు సబ్సిడీ ఆదా అయిందని తెలిపారు. గడిచిన ఏడాదిలో పేదలకు 60 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామన్నారు. కొత్త పథకం ప్రారంభమైన తర్వాత తొలి ఏడాదిలో 1.5 కోట్ల కనెక్షన్లు ఇస్తామన్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ. 1600 లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయిస్తామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు