సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు

31 Aug, 2018 03:03 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న అరుంధతి రాయ్, ప్రశాంత్‌ భూషణ్, జిగ్నేశ్‌ మేవానీ

హైదరాబాద్‌కు వరవరరావు, ముంబైకి గొంజాల్వేస్, అరుణ్‌ ఫెరీరా తరలింపు

ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు.  విచారణ జరిగే సెప్టెంబర్‌ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్‌కు విమానంలో, వెర్నన్‌ గొంజాల్వేస్, అరుణ్‌ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్‌కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్‌ ఆరోపించారు. 

ట్రేడ్‌ యూనియన్‌ నాయకురాలు, లాయర్‌ సుధా భరద్వాజ్‌ను ఫరీదాబాద్‌లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్‌ కమిషనర్‌ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్‌ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఖండించిన మేధావులు, కార్యకర్తలు..
పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్‌లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్‌ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్‌ స్వామి ఆరోపించారు. మరోవైపు,  గౌతమ్‌ నవలాఖా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు