5 కోట్ల నకిలీ డ్రైవింగ్ లెసైన్సులు

30 May, 2016 02:13 IST|Sakshi
5 కోట్ల నకిలీ డ్రైవింగ్ లెసైన్సులు

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే రోడ్డు రవాణా భద్రతా బిల్లు
 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్‌లున్నాయని.. డ్రైవింగ్ లెసైన్స్ పొందేందుకు చాలామంది నకిలీ డాక్యుమెంట్లను ఇస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఆదివారం రాజ స్తాన్ రవాణా శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన రవాణా మంత్రుల సమావేశంలో గడ్కారీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్‌లను, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

డ్రైవింగ్ లెసైన్స్ నకిలీదని తేలితే సదరు వ్యక్తులకు గరిష్టంగా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించనున్నారు. నకిలీ లెసైన్స్‌దారుల ఆటకట్టించేందుకు కంప్యూటరైజ్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లను నిర్వహించనున్నారు.  ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా భద్రతా బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఇకనుంచి డ్రైవింగ్ లెసైన్స్‌కు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు