రామమందిరం పనులు 50 శాతం పూర్తి

13 Nov, 2018 05:11 IST|Sakshi

అయోధ్య: అయోధ్యలో శ్రీరామమందిరానికి సంబంధించి శిల్పాలు, శిలల పనులు 50 శాతం పూర్తయ్యాయని కరసేవకపురం ఇన్‌చార్జి అన్నుభాయ్‌ సోమ్‌పురా తెలిపారు. తగినన్ని నిధులు లేకపోవడంతో ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కరసేవకపురంలో ఇద్దరు శిల్పులతో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రామమందిర ఉద్యమం తీవ్రంగా ఉన్న 1990ల్లో ఇక్కడ 150 మంది శిల్పులు పనిచేసేవారన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాగానే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. శంకుస్థాపన జరిగిన ఐదేళ్లలో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక ఆలయం 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 128 అడుగుల ఎత్తులో ఉంటుందన్నారు. రామమందిరాన్ని మొత్తం రెండంతస్తుల్లో నిర్మిస్తామనీ, ఒక్కో అంతస్తులో శిల్పాలు చెక్కిన 106 స్తంభాలు ఉంటాయని వెల్లడించారు. కరసేవకపురంలో ప్రతిరోజూ పనులు జరుగుతాయనీ, ఒక్క అమావాస్య రోజుమాత్రం అన్నింటిని నిలిపివేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు