భారత భూభాగంలోకి చొరబడ్డ 50 మంది చైనా అశ్వికులు

22 Jul, 2013 05:54 IST|Sakshi
భారత భూభాగంలోకి చొరబడ్డ 50 మంది చైనా అశ్వికులు

- భారత బలగాలు రంగంలోకి దిగడంతో తిరుగుముఖం

కొద్దికాలంగా భారత భూభాగం వద్ద దూకుడు కొనసాగిస్తున్న చైనా బలగాలు మరోసారి ‘హద్దు’మీరాయి. జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో చుమార్ వద్ద దాదాపు 50 మంది చైనా సైనికులు గుర్రాలపై వచ్చి, భారత భూభాగంలోకి చొరబడ్డారు. చైనా సైనికులు జూలై 16 సాయంత్రం చుమార్ వద్ద భారత భూభాగంలోకి చొరబడ్డారని, జూలై 17 ఉదయం వరకు అక్కడే ఉన్నారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత సైనికులు అక్కడకు చేరుకోవడంతో చైనా సైనికులు తిరుగుముఖం పట్టినట్లు చెప్పాయి.

భారత సైనికులు అక్కడకు చేరుకున్న తర్వాత యథాప్రకారం సరిహద్దుల వద్ద ఉభయ సైన్యాల కవాతు జరిగిందని, ఆ తర్వాత చైనా సైనికులు తమ భూభాగం వైపు వెనక్కు మళ్లారని వివరించాయి. భారత భూభాగంలోకి చొరబడ్డ చైనా సైనికులు తొలుత తాము చైనా భూభాగంలోనే ఉన్నామంటూ, భారత సైనికులను వెనక్కు మళ్లాలని చెప్పినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. చుమార్ సెక్టార్ వద్ద భారత గగనతలంలోకి జూలై 11న రెండు చైనా హెలికాప్టర్లు చొరబడ్డ కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది.. చైనా బలగాలు జూన్ 17న ఇదే ప్రాంతంలోకి చొరబడి, భారత సైన్యం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాను తొలగించి, తమతో తీసుకుపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా ఒక ప్లటూన్ చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి.

ఈ సంఘటనపై ఉభయ దేశాల నడుమ దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, చైనా సరిహద్దుల వెంబడి 50 వేల బలగాలతో ‘మౌంటెయిన్ స్ట్రయిక్ కోర్’ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన రోజునే తాజా చొరబాటు సంఘటన జరగడం గమనార్హం. గతనెలభారత రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చైనా పర్యటన నేపథ్యంలో ఉభయ దేశాలూ వాస్తవాధీన రేఖ వద్ద శాంతి సామరస్యాల కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించుకున్నాయి. అయితే, అప్పటి నుంచి చైనా బలగాలు తరచుగా చొరబాట్లకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో చైనా సరిహద్దుల వద్దనున్న చుమార్ ప్రాంతంలో తరచూ చొరబాట్లు జరుగుతున్నాయి.

ఎలాంటి చొరబాట్లనైనా తిప్పికొట్టే సత్తా ఉంది: కేంద్రం
చైనా నుంచి ఎలాంటి చొరబాట్లనైనా తిప్పికొట్టే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనా బలగాల తాజా చొరబాటుపై వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. చైనా చర్యలు దురదృష్టకరమని, ఈ అంశాన్ని ప్రభుత్వం చైనా దృష్టికి తీసుకువెళ్లి, నిరసన ప్రకటించనుందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ చెప్పారు. అయితే, కేంద్రంలో నాయకత్వ లోపం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ విమర్శించింది.

చైనా చొరబాటుదారుల ప్రాసిక్యూషన్‌కు సిఫారసు...
భారత భూభాగంలో పట్టుబడ్డ ముగ్గురు చైనా చొరబాటుదారుల ప్రాసిక్యూషన్‌కు భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశాయి. సలామో, అబ్దుల్ ఖాలిక్, అదిల్ తొర్సాంగ్ అనే ముగ్గురు చొరబాటుదారులు జూన్ 12న లడఖ్ ప్రాంతంలో సుల్తాన్‌చ్కు వద్ద పట్టుబడ్డారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌లపై ఆకర్షణతో తాము ఇక్కడకు వచ్చినట్లు వారు చెప్పినా, తప్పించుకునే ఎత్తుగడగానే భావిస్తున్నట్లు భద్రతా వర్గాలు చెప్పాయి.

>
మరిన్ని వార్తలు