50 లక్షల కేజీల టపాసులు కాల్చారు

9 Nov, 2018 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన ఢిల్లీ ప్రజలు సుమారు 50 లక్షల కిలోల బాణసంచా కాల్చారని సర్వేలో తేలింది. సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా కూడా గతేడాదికి సమానంగా అంత మొత్తంలో టపాసులు పేల్చడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 50 లక్షల కిలోల బాణసంచా.. సుమారు లక్షా యాభై వేల కిలోల పీఎం 2.5 కణాల ద్రవ్యరాశికి సమానం. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) దారుణంగా పడిపోయి 642కు చేరింది. దీన్ని అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిగా భావిస్తారని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సఫర్‌ అనే సంస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో వాయు నాణ్యత అదే స్థాయిలో కొనసాగొచ్చు.
11 రెట్ల కాలుష్యం: సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్ణీత సమాయానికి ముందు, తరువాత బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్యం అనుమతించదగిన పరిమితుల కన్నా 11 రెట్లు అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే ఎన్‌–99 ముసుగులు ధరించాలని వైద్యులు సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఘటనలపై 550కి పైగా కేసులు నమోదుచేసి, 300 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2500 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు