50వేల ఉద్యోగాలు

29 Aug, 2019 04:00 IST|Sakshi

3 నెలల్లో భర్తీ   జైల్లో ఉన్న నేతలు పెద్ద నాయకులవుతారు

రాహుల్‌ రాజకీయ బాలుడు

కశ్మీర్‌ గవర్నర్‌ మాలిక్‌

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్‌ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు.

ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు.

ఇంటర్నెట్‌ చాలా ప్రమాదకరం
‘ఇంటర్నెట్‌ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్‌ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్‌పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్‌కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్‌ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు.

రాహుల్‌ రాజకీయ బాలుడు
కశ్మీర్‌లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్‌ మాలిక్‌ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్‌ చేసిన ప్రకటనను వాడుకుని పాక్‌ ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్‌పై కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్‌ 370ను సమర్థించే కాంగ్రెస్‌ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నేత(ఆధిర్‌ రంజన్‌ చౌధురి) కశ్మీర్‌పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్‌ అన్నారు.  

రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ
కశ్మీర్‌ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దుని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ వెల్లడించింది. అక్టోబర్‌ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్‌ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్‌ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

కశ్మీర్‌పై జీవోఎం
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం
కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్‌తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర  సభ్యులు. ఈ బృందం ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్‌లో ఉంటుంది.

‘కశ్మీర్‌’ అంతర్గత అంశమే
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  
కశ్మీర్‌లో హింసను పాకిస్థాన్‌ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కశ్మీర్‌ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్‌ హస్తం ఉందన్నారు. కశ్మీర్‌ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్‌ బుధవారం ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్‌ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్‌కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ ప్రవేశపెట్టిన పిటిషన్‌లో రాహుల్‌ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు. పాక్‌ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్‌ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు.  

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి: జవదేకర్‌
కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీరుపై జవదేకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్‌ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్‌ను ప్రశ్నించారు. కశ్మీర్‌ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్‌ బుధవారం ట్వీట్‌ చేయడంపై జవదేకర్‌ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్‌ అంశంపై రాహుల్‌ యూ–టర్న్‌ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు.   

రాహుల్‌కు ముద్దు
వయనాడ్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్‌ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్‌ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్‌ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు