కరోనాకు 53 మంది బలి

3 Apr, 2020 01:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2,069 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. వైరస్‌ బారిన పడ్డ వారిలో 155 మందికి నయం కావడం లేదా డిశ్చార్జ్‌ అయిపోవడం లేదా వలస వెళ్లిపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌–19 బాధితుల సంఖ్య 1,860గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌ కారణంగా గత 24 గంటల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు నలుగురు కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురని, పంజాబ్‌ నుంచి ఒక్కరు ఉన్నారని తెలుస్తోంది. కోవిడ్‌ కారణంగా ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 13 మంది, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఆరుగురు చొప్పున, పంజాబ్‌లో నలుగురు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళల్లో ఇద్దరు చొప్పున, తమిళనాడు, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో బాధితులు ఎక్కువ... 
కోవిడ్‌ బారిన పడ్డవారిలో సుమారు 335 మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా, కేరళలో 265 మంది ఉన్నారు. అలాగే తమిళనాడులో మొత్తం 234 మందికి వైరస్‌ సోకింది. ఢిల్లీలో బాధితుల సంఖ్య 152కు చేరుకోగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య 113గా ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ కోవిడ్‌ బారిన పడ్డవారు 110 మంది ఉన్నారు.  రాజస్తాన్‌లో 108 మంది, మధ్యప్రదేశ్‌లో 99 మంది, గుజరాత్‌లో 82 మంది, జమ్మూ కశ్మీర్‌లో 62 మంది వైరస్‌ బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంజాబ్‌లో 46 కేసులను గుర్తించగా, హరియాణాలోనూ 43 మంది వైరస్‌ బారిన పడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో 37 మంది, బిహార్‌లో 23 మంది చండీగఢ్‌లో 16 మంది, లడాఖ్‌లో 13 మంది కోవిడ్‌ బాధితులు ఉండగా, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి పది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం తొమ్మిది మందికి వైరస్‌ సోకింది. ఉత్తరాఖండ్‌లో ఏడుగురు, గోవాలో ఐదుగురు కరోనా బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఒరిస్సాలోనూ నాలుగు కోవిడ్‌ కేసులు ఉన్నాయని పుదుచ్చేరి, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ముగ్గురు చొప్పున కోవిడ్‌ బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఈశాన్యరాష్ట్రాలు అస్సాం, జార్ఖండ్, మిజోరం, మణిపూర్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు