ప్రైవేటు అయితే ఖరీదెక్కువ..

31 May, 2020 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అయిన ‘లోకల్‌సర్కిల్స్‌’ ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో దాదాపు 40 వేల అభిప్రాయాలు వచ్చాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ప్రారంభిస్తే వైద్యం ఖర్చు విపరీతంగా పెరుగుతుందని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే రెండోసారి కరోనా సోకే అవకాశం ఉందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు.

కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే నిర్దేశించాలని 61 శాతం మంది కోరారు. కరోనాకు చికిత్స చేసేందుకు తగిన పరికరాలు ఆస్పత్రుల వద్ద లేవని 32 శాతం మంది చెప్పారు. చికిత్స ఎక్కడ చేయించుకోవాలనే విషయంపై 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులను, 32 శాతం మంది ఇళ్లలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని అభిప్రాయపడ్డారు. మరో 14 శాతం మంది మాత్రం ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.

మరిన్ని వార్తలు