భారీ పేలుడు: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

1 Jul, 2020 15:50 IST|Sakshi

చెన్నై :  త‌మిళ‌నాడు థ‌ర్మ‌ల్ ప్లాంట్‌లో బుధ‌వారం సంభ‌వించిన పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాలలో ఒక్కొక్క‌రికి 3 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి ల‌క్ష రూపాయ‌లు, స్వ‌ల్ప‌గాయాలైన వారికి 50 వేల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని అందిస్తామ‌ని తెలిపారు. ఇది వ‌ర‌కే సీఎం ప‌ళ‌నిస్వామితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి  అమిత్ షా  తప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 
(ఈ సారి లాల్‌బ‌గ్చా గ‌ణేశుడి ఉత్స‌వాలు లేవు )

భారీ పేలుడు  ఘ‌ట‌న‌లో ఆరుగురు చ‌నిపోగా, 17 మంది తీవ్ర ‌గాయాల‌పాల‌య్యారు. క‌డ‌లూరులోని నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ( ఎన్ఎల్‌సీ ) థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్-2లోని ఐదవ యూనిట్ వద్ద బాయిల‌ర్ పేలి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్ద‌రు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించగా 17 మందికి తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను చెన్నైలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఎన్‌ఎల్‌సి ద‌గ్గ‌రున్న అగ్నిమాప‌క బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని లేదంటే ప‌రిస్థితి ఇంకా భ‌యానకంగా మారేద‌ని అధికారులు పేర్కొన్నారు. బాయిల‌ర్ పేలుడుకు గ‌ల కార‌ణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మే నెల‌లోనూ ఇదే విధ‌మైన పేలుడు సంభ‌వించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రమాదంలో ఐదుగురు చ‌నిపోయారు.

మరిన్ని వార్తలు