విమానం 6 గంటల ఆలస్యం.. రచ్చరచ్చ

4 Jun, 2018 08:37 IST|Sakshi
ఎయిరిండియా విమానం (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఎయిరిండియా విమానయాన సంస్థ మరోసారి ప్రయాణికుల ఆగ్రహనికి బలైంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 విమానం సుమారు ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో, ముంబై అంతర్జాతీయ విమానశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో లక్నోలో ఉదయం 10.30 గంటలకు దిగాల్సిన ప్రయాణికులు, సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. విమాన రాకకు ఆలస్యంపై ఎయిరిండియా అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో, బోర్డింగ్‌కు వేచిచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం పాలయ్యారు. మరోవైపు వారికి ఆహారం కానీ, మంచి నీళ్లు కానీ ఎలాంటి సౌకర్యాలను ఎయిరిండియా అధికారులు కల్పించలేదు. ఎందుకు విమానం ఆలస్యం అవుతుందో కూడా సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
 
ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 అసలు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ముంబై అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 8 గంటలకు బయలుదేరి, లక్నోకు ఉదయం 10.30కు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2.30 అయినా విమానం టేకాఫ్‌ కాలేక పోయింది. విమానం కోసం వేచిచూస్తున్న ప్రయాణికులకు ఏమైందో కూడా తెలియలేదు. ఎయిరిండియా అధికారులను అడిగినా వారు కూడా సరిగ్గా స్పందించలేదు. సమాధానం చెప్పకపోగా.. తమల్ని తప్పించుకుంటూ తిరిగారని ప్రయాణికుడు వివేక్‌ భల్లా చెప్పాడు. ఇక గ్రౌండ్‌ స్టాఫ్‌ అయితే తమతో చాలా అమర్యాదగా వ్యవహరించినట్టు పేర్కొన్నాడు. తమల్ని బెదిరించినట్టు కూడా తెలిపాడు. 

సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు మధ్యలో కల్పించుకుని, తమల్ని వారి బారి నుంచి కాపాడినట్టు పేర్కొన్నాడు. ఎయిరిండియా అధికారులు ఎప్పుడూ ప్రయాణికులతో అమర్యాదగానే వ్యవహరిస్తారని భల్లా చెప్పాడు. ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవించినట్టు చెప్పాడు. లక్నోలో తమ బంధువు చనిపోతే, కడసారి చూపుకు వెళ్తున్న ఓ ప్రయాణికులకు అది నెరవేరకుండా చేశారని మండిపడ్డాడు. విమాన టిక్కెట్లపై తాము భారీ మొత్తంలో వెచ్చిస్తామని, కానీ వారు తీరిగ్గా గంటల కొద్దీ విమానాన్ని ఆలస్యం చేస్తారని ఎద్దేవా చేశాడు.  విమానం ఆలస్యం, సరిగ్గా స్పందించలేకపోవడంపై పైలెట్‌, విమానంలో ప్రయాణికులను క్షమాపణ కోరాడు. సిబ్బందితో హైదరాబాద్‌ నుంచి వస్తున్న విమానం టెక్నికల్‌ సమస్యతో ఆలస్యమైందని, తమ మొత్తం ప్రొగ్రామ్‌లను రీషెడ్యూల్‌ చేసి, కొత్త విమానం, సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నాడు. 
 

మరిన్ని వార్తలు