ఆరుగురు ఉగ్రవాదుల హతం

19 Nov, 2017 02:34 IST|Sakshi

మృతుల్లో ముంబై దాడుల సూత్రధారి లక్వీ మేనల్లుడు

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్‌ రెహ్మాన్‌ లక్వీ మేనల్లుడు ఒవైద్‌ సహా పాక్‌కు చెందిన ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్‌)కు చెందిన ఓ ‘గరుడ్‌’ కమాండో ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్‌ గాయపడ్డారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ), రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం చందర్‌గీర్‌ గ్రామాన్ని చుట్టుముట్టింది. గాలింపు సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.

ఈ విషయమై కశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ స్పందిస్తూ..‘ భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో లక్వీ మేనల్లుడు ఒవైద్, లష్కరే కమాండర్లు జర్గమ్, మెహమూద్‌లతో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వీరందరూ పాక్‌ నుంచి ప్రవేశించారు. ఘటనాస్థలి నుంచి ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’ అని ట్వీటర్‌లో తెలిపారు. ఈ ఏడాది కశ్మీర్‌లో ఇప్పటివరకు 170 మంది ఉగ్రవాదుల్ని ఏరివేసినట్లు చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ 2న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6 తేదీన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు చంపేశాయి.

>
మరిన్ని వార్తలు