ఇరాన్‌ నుంచి స్వదేశానికి 

11 Mar, 2020 02:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్‌–19 బారిన పడిన వారి సంఖ్య భారత్‌లో 60కి చేరుకుంది. మూడేళ్ల చిన్నారితోపాటు సుమారు 44 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సోమవారం నిర్ధారణ కాగా.. తాజాగా కేరళలో మరో 8 కేసులు, కర్ణాటకలో 3, పుణేలో 5 కేసులు నమోదైనట్లు తెలియడంతో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 60కి చేరింది. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మణిపూర్‌ మయన్మార్‌ సరిహద్దులను మూసివేశారు. వైరస్‌ గుప్పిట్లో ఉన్న ఇరాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను వాయుసేన విమానమొకటి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది. ఇరాన్‌లోని భారతీయులతో కూడిన సీ17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం సోమవారం ఘజియాబాద్‌ దగ్గర్లోని హిండోన్‌ విమానాశ్రయంలో దిగిందని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్‌ కెప్టెన్‌ అనుపమ్‌ బెనర్జీ తెలిపారు.

విమానంలో మొత్తం 25 మంది పురుషులు, 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రయాణికులతోపాటు ఇరాన్‌లోని 529 మందిని నమూనాలను విమానం ద్వారా తీసుకొచ్చామని ఆమె తెలిపారు. కరోనా వైరస్‌ కోసం ఈ నమూనాలను ఇక్కడ పరీక్షించనున్నారు. ఇరాన్‌లో మొత్తం రెండు వేల మంది భారతీయులు ఉన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన 58 మందిని హిండోన్‌ సమీపంలోని ఓ వైద్యశాలలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం హిండోన్‌లో ల్యాండ్‌ అయిన కొద్ది సేపటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ ఒక ట్వీట్‌ చేస్తూ.. విమానం ల్యాండ్‌ అయినట్లు, మరో రెస్క్యూ కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు