చనిపోలేదు.. బతికే ఉన్నాడు

14 Aug, 2019 16:57 IST|Sakshi

బెంగళూరు: వెంకటేశ్‌ మూర్తి.. బహుదూరపు బాటసారి ఇతను. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 10 వేల కిలోమీటర్ల దూరాన్ని కేవలం సైకిల్‌పై తిరుగుతూ సునాయాసంగా పూర్తి చేశాడు. తాజాగా పారుతున్న నదిలోకి దూకి రెండు రోజులపాటు కనిపించకుండా పోవటంతో వార్తల్లోకెక్కాడు. కర్ణాటకలో వరదలకు బిక్కుబిక్కుమంటూ అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటే ఈ 60 సంవత్సరాల వృద్ధుడు మాత్రం వరదకు ఎదురీదాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవటంతో అది అతని చివరి ఫీట్‌ అంటూ నదిలోకి దూకిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కర్ణాటకలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన వరదలు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కబిని రిజర్వాయర్‌ వరద గేట్లు ఎత్తడంతో నంజాగూడ్‌ టౌన్‌ వరద నీటిలో చిక్కుకుపోయింది. దీంతో కాలనీవాసులు అన్నీ వదిలేసి సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. వరద కోపానికి విసిగిపోయిన వెంకటేశ్‌ మూర్తి ఉదృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలోకి దూకాడు. రెండు రోజులు గడిచినా అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతను మరణించినట్టుగా సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా అతను సోమవారం ప్రాణాలతో తిరిగొచ్చాడు. పోలీస్‌ స్టేషన్‌కు కూడా వచ్చినట్టుగా అక్కడి పోలీసులు వెల్లడించారు.

అయితే అందరూ భయపడినప్పటికీ అతని సోదరి మంజుల మాత్రం తను కచ్చితంగా తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేసింది. కొన్ని ఏళ్ల తరబడి అతను ఇలానే చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇక అతను ఆ నదిలో కొంతదూరం ప్రయాణించిన తర్వాత హెజ్జిగె బ్రిడ్జి దగ్గర చిక్కుకుపోయాడు. అది గమనించింన జనాలు తాడు సాయంతో పైకి తీసుకురావడానికి ప్రయత్నించగా కాసేపటికి కనిపించకుండా పోయాడు. దీంతో అతను చనిపోయాడని భావించారు. వరద తగ్గుముఖం పట్టిన 60 గంటలకు అతను వరద ప్రవాహం నుంచి బయటపడ్డాడు. దీనిపై మూర్తి మాట్లాడుతూ.. ‘నేను ఓ పిల్లర్‌ను ఎంచుకుని దాన్ని బలంగా పట్టుకున్నాని, అక్కడ కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటంతో చిక్కుకుపోయాన’ని ఓ వార్తా చానెల్‌తో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు