-

పెళ్లికూతుర్ని చూద్దామని వెళ్లి బుక్ అయ్యాడు..

20 Mar, 2015 12:39 IST|Sakshi
పెళ్లికూతుర్ని చూద్దామని వెళ్లి బుక్ అయ్యాడు..

చెన్నై:  మలి వయసులో తోడు కోసం పెళ్లి ప్రకటన ఇచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది.  ఏదో అనుకుంటే ....ఇంకేదో అయిందన్నది ఈ పెద్దాయనకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. చివరికి సమయస్ఫూర్తిగా  వ్యవహరించి పెళ్లి మాట దేవుడెరుగు .. బతుకు జీవుడా  అనుకుంటూ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డ వైనం  చైన్నై తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు  చెన్నైకి చెందిన  రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తి.  భార్యనుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఆయనకు..ఆలోచన  వచ్చిందే తడవు...వధువు కావాలి అని పేపర్లో ప్రకటన  ఇచ్చాడు.  అనుకున్నట్టుగానే స్పందన కూడా  బాగానే వచ్చింది.  వైష్టవి అనే 35ఏళ్ల మహిళ ఫోన్ చేసి.. కోయంబేడు  బస్స్టాప్కు రమ్మని ...మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది.. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..

పెళ్లికూతుర్ని చూడాలని  ఆతృతగా  వెళ్లిన రామ్మూర్తితో  వైష్ణవి కలిసి మాటలు కలిపింది.  వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇంతలో  నలుగురు యువకులు హఠాత్తుగా చుట్టుముట్టి రామ్మూర్తిపై దాడి చేశారు. నిమిషాల్లో వైష్ణవితోపాటు, ఆ  నలుగురు యువకులు ఆయన్నిఎత్తి కారులో వేశారు.   రెండు రోజులు నగరమంతా తిప్పారు. చివరికి ఒక బ్యాంక్ దగ్గరికి  తీసుకువెళ్లి రామ్మూర్తి ఖాతాలో ఉన్న రూ.35 లక్షలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో అప్రమత్తమైన రామ్మూర్తి తెలివిగా వ్యవహరించి  తాను కిడ్నాప్ అయిన విషయాన్ని బ్యాంక్ అధికారుల చెవిన వేశాడు.   వెంటనే  అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది తాంబరం  పోలీసులకు సమాచారమందించారు.   హుటాహుటిన పోలీసు బృందం స్పాట్కు చేరుకుంది.  అయితే దీన్ని  గమనించిన ఆ ముఠా ..వైష్ణవితో పాటు అక్కడ నుంచి ఉడాయించింది.  దాంతో బతుకు జీవుడా అనుకున్న రామ్మూర్తి ..అక్కడ నుంచి బయటపడ్డాడు.

మరిన్ని వార్తలు