మూడో విడత 61% పోలింగ్‌

20 Feb, 2017 01:04 IST|Sakshi
మూడో విడత 61% పోలింగ్‌

యూపీలో ఓటేసిన రాజ్‌నాథ్, అఖిలేశ్, మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో విడతలో 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకొంది. ఈ స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 59.96 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 58.43 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 55 స్థానాలను, బీఎస్పీ ఆరు, బీజేపీ ఐదు, కాంగ్రెస్‌ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు.

ఓటేసిన ప్రముఖులు
కాగా మూడో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బహుజనన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై ఆశాభావం
ఈ సందర్భంగా ప్రధాన పక్షాలన్నీ అధికారం తమదేనని ఘంటాపథంగా చెప్పాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ‘బీఎస్పీ 300 సీట్లను సాధించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా యూపీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమికే ప్రజలు పట్టం కడతారని ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

అఖిలేశే మళ్లీ సీఎం: ములాయం
యూపీకి అఖిలేశ్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

ఈ గాంధీలు ఎవరికి ఓటేశారో!
యూపీ మూడో దశ పోలింగ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాంధీలు ఓటేశారు.  వీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారులు కాదులెండి. లక్నోలోని ఓ కుటుంబంలోనూ రాజీవ్‌ గాంధీ (46), సంజయ్‌ గాంధీ (45), సోనియా గాంధీ (40)లు ఉన్నారు.  రాజీవ్, సంజయ్‌లు అన్నదమ్ములు కాగా, సోనియా మాత్రం ఇక్కడ సంజయ్‌ భార్య. మరి ఈ గాంధీలను ఎవరికి ఓటేశారని అడగ్గా బయటకు వెల్లడించేందుకు   నిరాకరించారు.

మరిన్ని వార్తలు