ఆగని ‘మహా’ వ్యథ

22 Nov, 2019 04:26 IST|Sakshi

మరాఠ్వాడాలో దాదాపు నెలరోజుల్లో 68 మంది రైతుల ఆత్మహత్యలు

సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు.

అయితే అక్టోబర్‌లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో  68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్‌ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్‌కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్‌కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి.


ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్‌
రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్‌ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్‌ పి. సాయినాథ్‌ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్‌ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు