కేరళ వరదలు : రైతు ఆత్మహత్య

22 Aug, 2018 20:28 IST|Sakshi

ఎర్నాకుళం : ఎడతెరపి లేకుండా కేరళలో కురిసిన భారీ వర్షాలు వందలాది మందిని పొట్టన పెట్టుకోగా.. లక్షలాది మందిని నిరాశ్రయులు చేసింది. ఇప్పుడే కాస్త వర్షాలు తగ్గుమఖం పట్టి, వరదలు తగ్గుతుండటంతో, ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు కళకళలాడిన ఇళ్లు.. ప్రస్తుతం వరద బురదకు కొట్టుకుని ఉండటాన్ని చూసుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. సర్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గత మూడు రోజుల్లో, ముగ్గుర వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎర్నాకులం జిల్లా వరపుజ్హలో ఓ 68 ఏళ్ల రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని కే రాఖీగా గుర్తించారు. పునరావాస కేంద్రం నుంచి మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రాఖీ.. మంగళవారం వరద నీటితో దెబ్బతిన్న తన ఇంటిని చూసుకుని కుమిలిపోయాడు. 

ఇంటిలో పేరుకుపోయిన బురదను బయటికి నెట్టేయడానికి గంటల కొద్దీ శ్రమించాడు. కుటుంబ సభ్యులను తిరిగి పునరావాస కేంద్రానికి వెళ్లమని.. ఇంటిని శుభ్రం చేసి తర్వాతి రోజు ఉదయాన్నే అక్కడికి వచ్చి వారిని తీసుకెళ్తానని చెప్పాడు. వారిని తిరిగి క్యాంపుకు పంపించాడు. కానీ తర్వాత రోజు ఉదయం అల్పాహార సమయానికి రాఖీ అక్కడికి వెళ్లలేదు. వెంటనే కుటుంబ సభ్యులే ఇంటి వద్దకు వెళ్లారు. కానీ అక్కడ రాఖీ, ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనపడే సరికి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వరదలతో అన్నీ కోల్పోయామని రాఖీ బాగా బాధపడేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగ, కొజికోడ్‌ జిల్లాలో ఓ 19 విద్యార్థి కూడా వరదల్లో తన 12వ తరగతి సర్టిఫికేట్లు కొట్టుకుని పోయాయని తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిసూర్‌లో మరో వ్యక్తి కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరదల్లో బాగా నష్టపోయిన వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించడానికి సైకాలజిస్ట్‌లను కూడా ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు పంపిస్తోంది. ఈ వరదలతో కేరళలో ఎక్కువగా బలవన్మరణాలు సంభవించవచ్చని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు