కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వ నిర్ణయం

4 Jun, 2020 09:32 IST|Sakshi

ఢిల్లీ: బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చేవారు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు ఈ బాధ్యతను నిర్వర్తించాలని తెలిపింది. క్వారంటైన్‌ అవసరం లేదంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు తమను తాము పరిశీలించుకోవాలని.. కరోనా లక్షణాలు కనిపిస్తే.. జిల్లా పర్యవేక్షణ అధికారికి కానీ నేషనల్‌ కాల్‌ సెంటర్‌కు కానీ ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే గత వారంలో వరుస సడలింపులు ఇవ్వడంతో దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 23,645 కాగా.. రోజుకు దాదాపు 1200 వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల సంఖ్య కూడా బాగా పెరుగుతుండటంతో.. పౌరుల సలహాల మేరకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు.(కరోనా : రాజధాని సరిహద్దులు మూత)

లాక్‌డౌన్‌-5కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సెలూన్లు, స్పాలు తెరుచుకోడానికి అనుమతి తెలిపారు. అన్‌లాక్‌ 1.0 లో భాగంగా కేంద్రం అనుమతించిన అన్ని సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు రాష్ట్ర ఢిల్లీ సరిహద్దుల మూసివేత కొనసాగుతుందన్నారు. కేవలం అత్యవసర సరుకుల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు