నోట్ల కష్టాలతో 70 మంది మృతి: కాంగ్రెస్‌

12 Dec, 2016 14:52 IST|Sakshi
నోట్ల కష్టాలతో 70 మంది మృతి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. దేశవ్యాప్తంగా నోట్ల కష్టాలతో 13 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి సామాన్యులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనంలోకి తీసుకెళుతోందా, ముందుకు తీసుకెళుతోందా అని ప్రశ్నించారు. కేంద్రం పలాయనవాదం అవలంభిస్తోందని మండిపడ్డారు. తప్పించుకునే ధోరణి సరికాదని అన్నారు.

దేశంలో 86 శాతం నగదు నల్లధనం రూపంలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయని, నిజంగా మోదీ ఈ మాట అనుంటే అంతకన్నా అవమానకర ప్రకటన మరోటి ఉందని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు ఆనంద్‌ శర్మ అన్నారు. చట్టబద్దంగా దాచుకున్న నగదుపై నియంత్రణలు విధించడం సమంజసం కాదన్నారు. నోట్ల కష్టాలతో సామాన్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన​ వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు