ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ

28 Nov, 2019 17:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోయంబత్తూరు : తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్‌లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల  పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్‌సీ, ఎంఎస్‌సీ,ఎంకామ్‌,)వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా  వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్‌ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం నిన్న(బుధవారం) ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా,  వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ  బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి  వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా  పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున  పర్మినెంట్‌ జాబ్‌ కోసం చూస్తున్నానని చెప్పారు.

ఈ  ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్‌లో 2,000 మంది పర్మినెంట్‌, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు