లాక్‌డౌన్‌ తరువాత ఆ సమస్య రావొచ్చు

13 May, 2020 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ది అజీమ్‌ ప్రేమ్‌జీ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ ఎంప్లామెంట్‌ చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఏప్రిల్‌ 13 నుంచి మే 9 వరకు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారినే తీసుకున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వలన ఇండియాలో  దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిలో 67 శాతం మంది ఉపాధిని కోల్పోయారు. 63 శాతం మంది  ఆదాయాలు తగ్గిపోయాయి. (ఆర్థిక ప్యాకేజీ.. సాయంత్రం 4గంటలకు వివరాలు)

వీటిలో ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే 74 శాతం మంది కరోనా కాలంలో తమ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ఎప్పటి కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపారు. తరువాతి వారం రేషన్‌ సామాన్లు కొనడానికి 74 శాతం మంది దగ్గర డబ్బులు లేనట్టు తెలిపారు. ఇక వీరిలో చాలా మంది రోజు కూలీ చేసుకున్నే వారు, నెలకు 10,000 కంటే తక్కువ సంపాదించే వారే ఉన్నారు. అయితే ఇలా ఆహారం తక్కువగా తీసుకువడం వలన తరువాత చాలా మందిలో పోషకాహార లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ సమస్య అధికంకావొచ్చు అని నిపుణులు అంచనా వేస్తోన్నారు.

అయితే దీనిలో ఆనందించదగ్గ విషయం ఏంటంటే వీరిలో 86 శాతం మందికి ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులు, డబ్బులు అందుతున్నాయి. కరోనా కారణంగా కేవలం తిండి దొరకకపోవడమే కాకుండా చాలా మంది ఇంటి అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు.  చాలా మంది పక్కవారి నుంచి అప్పులు తీసుకుంటున్నారు. పల్లెలతో పోలీస్తే ఈ సమస్య పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అయితే దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని  మంగళవారం ప్రకటించింది. అందులో వలస కూలీలకు, దిగువ తరగతి వారికి ఏం కేటాయించారో బుధవారం సాయంత్రం తెలియనుంది. (కోయంబేడు కొంపముంచిందా?)

మరిన్ని వార్తలు