సరిహద్దు ఘర్షణ : 76 మంది జవాన్లు గాయపడ్డారు

19 Jun, 2020 08:18 IST|Sakshi

ఢిల్లీ : లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే విధుల్లో చేరుతారని వెల్లడించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. (నేపాల్‌ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత)

సోమవారం(జూన్‌ 15) అర్థరాత్రి తర్వాత గాల్వన్‌‌ లోయలోని పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద భారత బలగాలపై చైనా సైనికులు  రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండవచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.  అయితే భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు చైనా కస్టడీలో ఉన్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడంపై ఆర్మీ స్పందించింది. ' ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించారు. భారత బలగాల్లో ఎవరు కూడా చైనా కస్టడీలో లేరు. అనవసరంగా తప్పుడు కథనాలు రాయొద్దు' అంటూ తెలిపారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్‌ చేసిన సందర్భంగా గాల్వన్‌ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్‌ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. (బుల్‌డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!)

మరిన్ని వార్తలు