ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..

2 Mar, 2016 01:34 IST|Sakshi
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఎరుపెక్కిన సరిహద్దు
* ఎనిమిది మంది మావోయిస్టుల మృతి
* ఖమ్మం జిల్లా చర్ల మండల సరిహద్దులోని బొట్టెంతోగు అడవుల్లో ఘటన
* మావోయిస్టు ప్లీనరీ జరుగుతోందనే సమాచారం మేరకు గాలింపు
* సంయుక్తంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసుల కూంబింగ్
* పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు
* మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో హోరాహోరీగా ఎదురుకాల్పులు.. త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు
* ఘటనా స్థలంలో ఏకే-47 సహా ఎనిమిది ఆయుధాలు స్వాధీనం
* హెలికాప్టర్ల ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మృతదేహాల తరలింపు
* మృతుల్లో ముగ్గురిని గుర్తించిన పోలీసులు
* మిగతావారిని గుర్తించేందుకు ప్రయత్నాలు

 భద్రాచలం/చర్ల
మావోయిస్టులకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. భారీ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బొట్టెంతోగు అటవీ ప్రాంతం ఎరుపెక్కింది.. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరికొందరు గాయపడినట్లు భావిస్తున్నారు. పలువురు మావోయిస్టు అగ్రనేతలు త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలానికి... ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరుకు మధ్య మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురిని గుర్తించామని, ఘటనా స్థలంలో ఒక ఏకే-47 సహా ఎనిమిది తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు ప్రకటిం చారు. 3 రోజుల ప్లీనరీలో భాగంగా బొట్టెంతోగు అటవీప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలతో పాటు, సుమారు 250 మంది సాయుధులైన మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్‌తోపాటు అగ్రనేతలు, ఖమ్మం, వరంగల్, కరీంన గర్ జిల్లాలకు చెందిన నేతలు ఈ ప్లీనరీకి హాజరయ్యూరన్న సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. అడవిలో మావోయిస్టుల క్యాంపును గుర్తించి చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. పోలీసుల రాకను మావోయిస్టులు గుర్తించడంతో ఇరుపక్షాలూ పరస్పరం కాల్పులకు దిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ స్థలానికి అర కిలోమీటరు దూరంలో బస చేసిన మావోయిస్టు అగ్రనేతలు కూడా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 7.30 వరకు సుమారు పది రౌండ్ల పాటు కాల్పులు వినిపించినట్లు సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. హోరాహోరీ ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు

 ఆ ప్రదేశాన్ని పరిశీలించగా... ఎనిమిది మంది మావోరుుస్టుల మృతదేహాలు కనిపించాయి. వారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47, ఒక ఎస్‌ఎల్‌ఆర్, తపంచా, మూడు .303, రెండు ఎస్‌బీబీఎల్, ఒక బర్మా, ఒక బోల్ యాక్షన్ ఆయుధం, ఒక ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్లీనరీకి వినియోగించిన సామగ్రి, వంట పాత్రలు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన మావోయిస్టుల కథనాలతో కూడిన  పేపర్ క్లిప్పింగ్‌లు లభ్యమయ్యారుు. అరుుతే వాటిని ఘటనాస్థలంలో కాల్చివేసిన ఆనవాళ్లున్నాయి.

 హెలికాప్టర్ల ద్వారా మృతదేహాల తరలింపు

 ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టుల మృతదే హాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా భద్రాచలానికి మూడు హెలికాప్టర్లు వచ్చాయి. రెండు గగనతలంలోనే చక్కర్లు కొట్టగా... ఒకటి మాత్రం భద్రాచలం పట్టణంలోని టొబాకో బోర్డు ప్రాంగణంలోని హెలిప్యాడ్‌పై దిగింది. అక్కడి నుంచి అధికారులను తీసుకుని ఎన్‌కౌంటర్ స్థలానికి వెళ్లింది. కొద్దిసేపటికే మృతదేహాలను తీసుకుని టొబాకో బోర్డు ప్రాంగణానికి వచ్చారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు మూడు గంటల పాటు మృతదేహాలను మీడియా కంట కూడా పడకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. మృతదేహాలకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.

 గుర్తింపుపై తర్జనభర్జన

 మృతి చెందిన మావోయిస్టులను గుర్తించేందుకు పోలీసులు చాలా శ్రమించారు. సమీప ప్రాంతాల్లో ఇటీవల కాలంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులను రప్పించి  చూపించారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిని మార్చురీకి రప్పించి... మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరుకు చెందిన గొట్టిముక్కల రమేష్ అలియాస్ లచ్చన్న (52), మెదక్ జిల్లా దౌలతాబాద్ సమీపంలోని మాచిన్‌పల్లికి చెందిన యూసుఫ్‌బీ అలియాస్ సోనీ(40), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజు(25)లను గుర్తించారు. మిగతా ఐదు మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. మృతి చెందినవారిలో యూసుఫ్‌బీ అలియాస్ సోనీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య అని భావిస్తున్నారు.

 ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు

 - ఎనిమిది మందిలో ముగ్గురిని గుర్తించాం: డీజీపీ అనురాగ్‌శర్మ

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడ్డారని... ఆత్మరక్షణలో భాగంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయని... మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని డీజీపీ చెప్పారు. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా మావోయిస్టుల సంచారం ఉన్నట్లు సమాచారం ఉండడంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఒక ఏకే-47, ఒక ఎస్‌ఎల్‌ఆర్, మూడు .303, రెండు ఎస్‌బీపీఎల్ తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు