దాడిలో 80 కిలోల హైగ్రేడ్‌ ఆర్డీఎక్స్‌

16 Feb, 2019 05:11 IST|Sakshi

న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిలో జైషే మొహమ్మద్‌ కమాండర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ దాదాపు 80 కిలోల హైగ్రేడ్‌ ఆర్డీఎక్స్‌ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఐఈడీని ఈ దాడి కోసం వాడుంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. కశ్మీర్‌లో ఇప్పటివరకూ కాన్వాయ్‌ల రాకపోకల విషయంలో పాటిస్తున్న ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్‌వోపీ)ను తాజా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 272వ మైలురాయి వద్ద ఆదిల్‌ తన కారుతో సీఆర్పీఎఫ్‌ బస్సు ఎడమవైపు ఢీకొట్టించి తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించారు.

ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన హెచ్‌ఆర్‌ 49 ఎఫ్‌ 0637 బస్సు తునాతునకలు అయ్యిందన్నారు. కాన్వాయ్‌ వరుసలో ఐదో బస్సును ఉగ్రవాది ఆదిల్‌ లక్ష్యంగా చేసుకున్నాడన్నారు.  సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌లో ప్రమాద సమయంలో మొత్తం 16 బుల్లెట్‌ ప్రూఫ్‌ బంకర్‌ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న 2,871 మంది జవాన్లు 91 వాహనాల్లో ఇదే రోడ్డుపై శ్రీనగర్‌ నుంచి జమ్మూకు వచ్చారనీ, అప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో యూపీకి చెందిన 12 మంది జవాన్లు అమరులు కాగా, రాజస్తాన్‌(5), పంజాబ్‌(4), పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్‌ నుంచి ఇద్దరు చొప్పున, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని వార్తలు