ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు

4 Apr, 2020 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ : గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొని లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయిన 2,300 మందిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్‌ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది రాజధాని నలువైపుల్లోని వివిధ మసీదుల్లో రహస్యంగా తలదాచుకుంటున్న వీరిని గుర్తించారు. మొదట 187మంది విదేశీ జమాత్‌ కార్యకర్తలు, 24 మంది దేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ సంఖ్యలో విదేశీ కార్యకర్తలు బయటపడటం గమనార్హం. అధికారులు వీరిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. మరో రెండు రోజుల్లో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడో భయంకరమైన విషయం ఏంటంటే 800 మంది విదేశీయుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారు చాలా మందికి వైరస్‌ను అంటించి ఉంటార’’ ని అభిప్రాయపడ్డారు. ( తబ్లిగీ: కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు )

కాగా, నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు