81ఏళ్ళ వయసులో రికార్డు సృష్టించాడు!

15 Apr, 2016 20:05 IST|Sakshi
81ఏళ్ళ వయసులో రికార్డు సృష్టించాడు!

పుణె: పర్వతాలను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదలతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాల్సి ఉంటుంది. అటువంటిది 81 ఏళ్ళ వృద్ధుడు రికార్డు సృష్టించాడు.  హిమాచల్ ప్రదేశ్లో హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన  రూపిన్ పాస్ క్రాస్ అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు.

పుణెకు చెందిన గోపాల్ వాసుదేవ్ లేలే వయసు 81 సంవత్సరాలు. గతేడాది సెప్టెంబర్ లో పర్వతారోహణ చేసిన వ్యక్తి కంటే పది రెట్లు ఎక్కువగా హిమాలయ పర్వతాలను అధిరోహించాడు. అంతేగాక అతి పెద్ద వయసులో 15,350 అడుగుల ఎత్తైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రూపిన్ పాస్.. ఎక్కిన వ్యక్తిగా గోపాల్ వాసుదేవ్ లిమ్కా బుక్ లో తనపేరు నమోదు చేసుకున్నాడు. వర్షం, మంచు కురవడం, కొండ చెరియలు విరిగి పడటంతో పాటు...మైనస్ ఏడు డిగ్రీల్లో ఉండే చలిప్రాంతంలో ప్రయాణించి గోపాల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తలచిన కార్యం సిద్ధించాలంటే ముందుగా మానసిక శక్తి, ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం అంటాడు గోపాల్. తానో వృద్ధుడినని, తనకు 81 సంవత్సరాల వయసు ఉందన్న విషయాన్నిఎప్పుడూ తలచుకోనని, యువకుడిలాగానే  ఫీలౌతానని అంటాడు గోపాల్. 1972 నుంచి పర్వతారోహణ చేస్తున్న అతడు... ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంటాడు. శారీరక వ్యాయామంలో భాగంగా వారానికోసారి ముంబై-పుణె హైవే ప్రాంతంలో ఉన్నకొండలను కూడ ఎక్కుతుంటాడు. ఇప్పటికే కేదార్ నాథ్, కైలాష్, కాంచెన్ జుంగా, సంగ్లా లను అధిరోహించిన గోపాల్... ఈసారి సెప్టెంబర్ లో  ఉత్తరాఖండ్ లోని రూప్ కుంద్ ఎక్కేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. పుణెకు చెందిన ట్రెక్కింగ్ గ్రూప్ 'ట్రెక్నిక్' లో ఏడేళ్ళ క్రితం చేరిన అతడు అప్పట్నుంచీ అందులో భాగంగా మారిపోయాడు.

ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్ గా విద్యార్హతలు సంపాదించిన గోపాల్.. 1964 లో పుణెకు చేరుకున్నాడు. కొన్నాళ్ళపాటు వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసి, అనంతరం అక్కడే తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం వ్యాపార బాధ్యతలను కుమారుడికి అప్పగించేసినా  ప్రతిరోజూ ఒక్కసారైనా ఫ్యాక్టరీని సందర్శించి వస్తుంటాడు. అయితే పర్వతారోహణ రేస్ వంటిది కాదని, ఎత్తైన ప్రాంతాలను అధిరోహించేప్పుడు ఎంతో సావధానంగా ఉండాలని గోపాల్ సలహా ఇస్తాడు. ట్రెక్కింగ్ చేయాలంటే కొన్ని నెలల ముందునుంచే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు కావలసిన ప్రిపరేషన్ ఉండాలని సూచిస్తాడు. ట్రెక్కింగ్ లో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తక్కువై ఊపిరి కష్టమౌతుందని అంతా చెప్తుంటారని, తాను ఇప్పటికి ఎన్నోసార్లు హిమాలయాలను ఎక్కినా తనకా సమస్య ఎదురు కాలేదని చెప్తున్నాడు. ఆరోగ్యం, శరీర ధారుఢ్యం ఉన్నా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పర్వతారోహణ సాధ్యం కాదనే గోపాల్... ఎనభై ఏళ్ళు దాటిన వయసులోనూ బీపీ, సుగర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలేవీ లేకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉంటూ.. చిన్న వయసులోనే డీలా పడిపోయే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు